ఎస్‌ఐఆర్‌కు పోలీసులు సహకరించాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:26 AM
రాష్ట్రంలో ఈనెల 25నుంచి ఎన్నికల సంఘం చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పోలీసు విభాగాలు క్షేత్రస్థాయిలో...
సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 25నుంచి ఎన్నికల సంఘం చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పోలీసు విభాగాలు క్షేత్రస్థాయిలో సహకరించాలని ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. జాబితా సవరణలో విధులు నిర్వహించే బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు తగిన భద్రత కల్పించాలని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, తిరిగి వాటిని సేకరించాలని ఆయన సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జగరకుండా పోలీసులతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారుల(డీఈఓ)కు సూచించారు. కాగా, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను తొలగించకుండా పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహించాలని తెలంగాణ ఓటరు హక్కుల వేదిక (టీవీఆర్‌ఎఫ్) కోరింది. ఈ మేరకు అకునూరి మురళి నేతృత్వంలోని 8మంది సభ్యుల ప్రతినిధి బృందం సీఈఓను కలిసి వినతిపత్రం సమర్పించింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, వలస కార్మికులు తదితర వర్గాలకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.