Share News

నేటి నుంచి ‘సర్‌’ సన్నాహాలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:34 AM

రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌) సన్నాహక కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం....

నేటి నుంచి ‘సర్‌’ సన్నాహాలు

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌) సన్నాహక కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నేటి నుంచి 24 వరకు ఎన్యుమరేషన్‌ ఫారాల ముద్రణతోపాటు బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల (బీఎల్‌వో)కు శిక్షణ ఇస్తారు. 25 నుంచి సర్‌ అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఓటరు వివరాలను పరిశీలించి, అర్హులపేర్లు మాత్రమే ఓటరు జాబితాలో ఉండేలా కొత్త జాబితాను రూపొందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 88.13 లక్షల మంది ఓటర్ల వివరాల్లో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇప్పటికే తప్పులను రెడ్‌ ఫ్లాగ్‌ చేసింది. అయితే, ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాద ని, ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన మాత్రమేనని ఈసీ చెబుతోంది. 25 నుంచి బీఎల్‌ వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. దీని ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తారు. అందులో పేర్లు లేకపోయినా.. తప్పులు దొర్లినా ఓటర్లు సవరణల కోసం దరఖాస్తు చేసేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సమయం ఇస్తారు. ఫిర్యాదులపై విచారణ, పరిష్కార ప్రక్రియ ను సెప్టెంబరు 28 నాటికి పూర్తిచేస్తారు. తుది ఓట రు జాబితాను అక్టోబరు 1న ప్రచురిస్తారు. బీఎల్‌వోలు ప్రతి ఇంటిని సందర్శించి ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారికి ఎన్యుమరేషన్‌ ఫారాలను అందజేస్తారు. ఓటర్లు తమ పేరు, వయసు, కుటుం బ సభ్యుల వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే సవరణలు సూచించవచ్చు. ఇంటివద్ద ఎవరూ లేకపోతే బీఎల్‌వోలు కనీసం మూడుసార్లు ఆ ఇంటిని సందర్శించి వివరా లు సేకరించాలని ఈసీ ఆదేశించింది. బీఎల్‌వోలకు రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్‌ స్థాయి సహాయకు(బీఎల్‌ఏ)లు సహకరిస్తారు. బీఎల్‌వోలు వచ్చినప్పుడు ఓటరు అందుబాటులో లేకపోతే ము సాయిదా జాబితాలో ఆ ఓటరు పేరుపక్కన మార్క్‌ చేస్తారు. ఆగస్టులో వీరు ఆన్‌లైన్‌ ద్వారా లేదంటే.. నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో ఫామ్‌-8 సమర్పించి తమ ఓటును భద్రపరుచుకోవచ్చు.


లోపాలు సవరించడమే..

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఓటరు మ్యాపింగ్‌లో సుమారు 88.13 లక్షల ఓటర్ల వివరాల్లో అసమానతలు గుర్తించారు. పేర్లు, వయసు, బంధుత్వం, డూప్లికేట్‌ నమోదులు, చిరునామా మార్పుల వంటి అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిని పరిశీలించి సరిచేస్తారు. 2002లో జరిగిన సర్‌లో నమోదైన కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలిస్తారు. పాత రికార్డులతో పోల్చి తప్పులను గుర్తిం చి సరిచేయడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈసీ నియమాల ప్రకారం ఓటుకు పూర్తి రక్షణ కల్పిస్తారు. ఏ ఒక్కరి ఓటును కూడా ముందస్తు నోటీసు ఇవ్వకుండా జాబితా నుంచి తొలగించే అధికారం ఏ అధికారికీ లేదు. ఒకవేళ సాఫ్ట్‌వేర్‌ తప్పుగా చూపించినా, ఓటరు వివరణ తీసుకున్న తర్వాతే దానిపై నిర్ణయం ఉంటుంది.

ప్రజలేం చేయాలి..?

సర్‌ ప్రక్రియ సమయంలో బీఎల్‌వోలు అందజేసే ఎన్యుమరేషన్‌ ఫారాల్లో ప్రతి ఓటరు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తప్పులుంటే సవరణ కోరవచ్చు. 2002లో ఒక నియోజకవర్గంలో ఉండి ప్రస్తుతం మరో నియోజకవర్గంలో నివసిస్తూ అక్కడే ఓటు ఉంటే సాఫ్ట్‌వేర్‌ దాన్ని గుర్తిస్తుంది. ఓటరు ప్రస్తుతం ఉన్న ఫారంను నింపినప్పుడు 2002 నాటి డేటాబేస్‌లో వారి పేరు, తండ్రి/భర్త పేరును వెదికి పాత రికార్డును కొత్త రికార్డుతో ‘లింక్‌’ (క్రాస్‌ కానిస్టిటెన్సీ) చేస్తుంది. దీనివల్ల పాతచోట ఓటు రద్దవుతుంది. 2002 రికార్డుల్లో మీ ఓటు దొరక్కపోయినా ప్రస్తుత నివాస ప్రాంతంలో మీరు స్థానికులేనని ని రూపించే ప్రత్యామ్నాయ పత్రాలను (ఆధార్‌ కార్డు, కరెంట్‌ బిల్లు, రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌, పాస్‌పోర్ట్‌) పరిశీలించి ప్రస్తుత ఓటును ఖరారు చేస్తారు. కొత్తగా ఓటును నమోదు చేసుకోవచ్చు. వారి తండ్రి, తల్లికి సంబంధించిన 2002 ఓటరు ఐడీ రికార్డుతో పిల్లల ఓటును లింక్‌ చేస్తారు. ఓటరు పేరులో అక్షర దోషం లేదా ఇంటిపేరు మార్పు ఉంటే ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పదో తరగతి మార్కుల మెమో వంటివాటిని సమర్పించాలి. వయసు లేదా జన్మతేదీల్లో తేడా ఉంటే జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమో, ఆధార్‌ కార్డు పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. తల్లిదండ్రుల పేర్లు, బంధుత్వాల్లో తేడాలుంటే కుటుంబ రేషన్‌ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, పాఠశాల రికార్డులను సమర్పించాలి.

Updated Date - Jun 15 , 2026 | 04:34 AM