సవాళ్లతో సర్ షురూ
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:30 AM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.
తొలిరోజు మందకొడిగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
హైదరాబాద్‌లో అన్ని నియోజకవర్గాలకు అందనిఫారాలు
బీఎల్‌వోలకు అందని ఓటరు జాబితా ప్రీ మ్యాపింగ్ వివరాలు!
కొత్త జిల్లాలు, నియోజకవర్గాల విషయంలోనూ గందరగోళం
హైదరాబాద్‌లో తొలిరోజు విధులకు రాని 30శాతం బీఎల్‌వోలు
సర్‌పై రెచ్చగొట్టే ప్రకటనలు సరికాదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అయితే, ఎన్యుమరేషన్ ఫారాలను నింపటం, వాటిని యాప్‌లో నమోదుచేయటంలో తొలిరోజు అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సరిపడా ఎన్యుమరేషన్ ఫారాలు అందించకపోవటంతో తొలిరోజు ఓటర్లందరికీ వాటిని అందించలేకపోయారు. సర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు బీఎల్‌వోలకు ముందుగానే శిక్షణ ఇచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలను పరిష్కరించటంలో తికమక పడ్డారు. దీంతో తొలిరోజు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకొడిగా సాగింది. కొన్నిచోట్ల బీఎల్‌వోలు యాప్‌లో ఫారాల పంపిణీ సంఖ్యను నమోదుచేయకపోవటంతో తొలిరోజు ఎన్ని ఫారాలను పంపిణీ చేశారన్న సమాచారాన్ని ఈసీ అధికారులు ఇవ్వలేకపోయారు. రెండోరోజు నుంచి పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు.
సందేహాల స్వాగతం
సర్ ప్రక్రియలో 35,985 మంది బీఎల్‌వోలు, 3,596 మంది బీఎల్‌వో సూపర్ వైజర్లు, రాజకీయ పార్టీల తరఫున 49,018 మంది బీఎల్‌ఏలు పాల్గొంటున్నారు. ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న వివరాలతోపాటు స్థానిక బీఎల్‌వో పేరు, ఫోన్ నంబరు ఎన్యుమరేషన్ ఫారంపై ముద్రించి ఉంటాయి. ఓటరు పేరు, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా, పోలింగ్ కేంద్రం వివరాలతోపాటు ఫొటో ఉంటుంది. ఫారంలోని నిర్దేశిత ప్రదేశంలో ఓటరు పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబరు తదితర వివరాలు మళ్లీ నింపాలి. తాజా ఫొటోను జతపరచి సంతకం చేసి వచ్చే నెల 24లోపు బీఎల్‌వోలు మళ్లీ వచ్చినపుడు ఇవ్వాలి. ఒక ఫారంను బీఎల్‌వో తీసుకొని మరొకటి రశీదుగా ఓటరుకు ఇస్తారు. ఓటరు ఇంట్లో లేకపోతే కుటుంబంలో ఎవరైనా ఫారం నింపి సంతకం చేసి ఇవ్వొచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకుంటే బీఎల్‌వో నుంచి ఫారం-6ను తీసుకొని నింపాల్సి ఉంటుంది. అయితే, బీఎల్‌వోలకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టిన ఓటరు మ్యాపింగ్ వివరాలు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఓటరు వివరాల నమోదులో సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. ఓటరుకు వారి కుటుంబ సభ్యులను లింకప్ చేసిన సమాచారం లేకపోవడంతో తల్లి పేరుతో మ్యాపింగ్ చేసి ఉంటే.. ఇప్పుడు ఒకవేళ తండ్రి పేరుతో ఫారం నింపితే ఎలా అని ఒక బీఎల్‌వో సందేహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి మారిన ఓటర్ల వివరాలను కొన్నిచోట్ల పాత జిల్లాల పరిధిలోనే చూపడం గందరగోళానికి దారితీస్తోంది. 2002 ఓటరు జాబితా ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్న సమయంలో ఏ జిల్లా, నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న అంశంపై ఓటర్లతోపాటు బీఎల్ వోలకూ సందేహాలు వస్తున్నాయి. ఎన్యుమరేషన్ ఫారంపై ఉన్న బార్‌కోడ్ విషయంలో కొంతమంది బీఎల్‌వోలకు అవగాహన లేక మాన్యువల్‌గానే పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాల్లోనే..
హైదరాబాద్ జిల్లాలో సర్ కార్యక్రమం తొలిరోజు గందరగోళంగా మారింది. జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా.. తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రమే ఫారాలు అందాయి. ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో ఫారాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్ కార్యక్రమం తొలిరోజు ప్రారంభం కాలేదు. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా, తొలిరోజు 10 చోట్ల సర్ మొదలు కాలేదు. హైదరాబాద్ జిల్లాలో 47.36 లక్షల మంది ఓటర్లులున్నారు. ప్రతి ఓటరుకు ఒక ఫారం చొప్పున 47.36 లక్షల ఫారాలు ముద్రించాలి. సర్వే ప్రారంభమయ్యే నాటికి కనీసం ఐదు శాతం ఫారాలు కూడా ముద్రించలేదని సమాచారం. గురువారం ఉదయమే విధులకు వచ్చిన బీఎల్‌వోలకు ఫారాలు అందకపోవటంతో సాయంత్రం వరకు వేచిచూసి వెనుదిరిగారు. తొలిరోజు దాదాపు 30 శాతం బీఎల్‌వోలు విధులు నిర్వహించలేదని తెలిసింది. నగరంలో దాదాపు 30 శాతం వరకు బోగస్, మరణించిన, చిరునామా మారిన ఓటర్లు ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అవసరాన్ని బట్టి దశలవారీగా ఫారాలు ముద్రించాలని ఈసీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం ఓటర్లలో 60 శాతం దరఖాస్తులు ముద్రిస్తే సరిపోతుందని ఓ అధికారి తెలిపారు.
పోలియో విధుల్లో బీఎల్‌వోలు
ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లను కూడా బీఎల్‌వోలుగా నియమించారు. ఈ నెల 28వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులపాటు వారు ఆ విధుల్లో ఉంటామని చెబుతున్నారు. దీంతో వారు బీఎల్‌వోలుగా ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో సోమవారం వరకు సర్ సర్వే ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ నాలుగు రోజులు సర్ విధులకు రాలేమని ఎలక్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ లకు వారు సమాచారమిచ్చినట్టు తెలిసింది. మరోవైపు సర్ సర్వేలో బీఎల్‌వోలుగా నియమితులైన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలోని ఉద్యోగులను వారి సొంత డ్యూటీలు కూడా చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. సర్ విధుల్లో ఉన్నందున రోజువారీ విధులకు రాలేమని వారు చెబుతుండగా.. మధ్యాహ్నం వరకు సర్వేలో పాల్గొని, ఆ తరువాత ఆఫీ్‌సకు రావాలని ఆదేశించినట్లు సమాచారం.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలి:మంత్రి పొన్నం
సర్ ప్రక్రియలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-7, వెంకటేశ్వర కాలనీలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి గురువారం సర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఎల్‌ఏలు నిరంతరం బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ అర్హత ఉన్న ఏ ఒక్క ఓటూ జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
సర్‌పై రెచ్చగొట్టే ప్రకటనలు సరికాదు: కిషన్‌రెడ్డి
రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన సర్ కార్యక్రమంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, స్పష్టత, విశ్వసనీయత ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. దీనిని ఓటర్ల జాబితా సంస్కరణ ప్రక్రియగా చూడాలే తప్ప.. రాజకీయ కోణంలో చూడరాదని సూచించారు. కొన్నిపార్టీలు, కొందరు రాజకీయ నేతలు సర్‌పై రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
హైకోర్టులో కరీంనగర్‌వాసి పిటిషన్
రాష్ట్రమంతటా ‘సర్’ ఎన్యుమరేషన్ ఫారాలను ఒక్క తెలుగులోనే ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ ముజీబ్ దీనిని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కేవలం తెలుగులోనే ఫారాలు ఇవ్వడం వల్ల భాషాపరమైన మైనార్టీ ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఇంటింటికీ వచ్చే బీఎల్‌వోల వద్ద తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై స్పందన తెలియజేయాలని ఈసీని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.