Share News

ఇన్‌చార్జి మంత్రుల వైఫల్యమిది!

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:43 AM

సర్‌ ప్రక్రియలో రాష్ట్రంలో ఏకంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇన్‌చార్జి మంత్రుల వైఫల్యమిది!

  • మీరు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే

  • 21 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఏర్పడింది

  • హైదరాబాద్‌లో ఉండి సమీక్ష చేస్తామంటే కుదరదు

  • తక్షణమే జిల్లాలకు వెళ్లండి.. క్షేత్రస్థాయిలో సమీక్షించండి

  • ఇన్‌చార్జి మంత్రులకు సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరిక

  • ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఎక్కడా లేదు: మీనాక్షి

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో రాష్ట్రంలో ఏకంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి మంత్రులు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులం.. హైదరాబాద్‌లోనే ఉండి సమీక్ష చేస్తామంటే కుదరదన్నారు. ప్రభుత్వ పనులు పక్కనబెట్టి అయినా ఇన్‌చార్జి బాధ్యతలు వహిస్తున్న జిల్లాలకు వెళ్లి.. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహించాలంటూ ఆదేశించారు. ఇది కేవలం తన మాట కాదని, ఏఐసీసీ ఆదేశమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రులు సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లకుంటే అధిష్ఠానం ఉపేక్షించబోదని హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సీరియ్‌సగా తీసుకుంటున్న అధిష్ఠానం.. నివేదికల ఆధారంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చారు. ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇన్‌చార్జి మంత్రులు, పార్లమెంటు ఇన్‌చార్జిలతో గురువారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్యూమరేషన్‌ విషయంలో ఇన్‌చార్జి మంత్రుల నుంచి బీఎల్‌ఏల వరకు సరైన బాధ్యత తీసుకోక పోవడం వల్లనే 21-22 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడింది. తక్షణమే సంబంధిత ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లాలి. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులతో సమీక్ష నిర్వహించాలి. రానున్న రెండు రోజులూ క్షేత్రస్థాయిలోనే ఉండాలి.


అవసరమైతే ప్రభుత్వ కార్యక్రమాలనూ పక్కన పెట్టి సమీక్ష నిర్వహించాలి. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నివేదిక తయారు చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు నాలుగు రోజులు నియోజకవర్గంలోనే ఉండి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలి’’ అని నిర్దేశించారు. ఓట్లు పోకుండా పూర్తిస్థాయిలో చూడాలని, సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లకుంటే పార్టీ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఇది ఏఐసీసీ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశమని చెప్పారు. పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లకుంటే భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి చేస్తున్న కుట్ర

సర్‌ ప్రక్రియను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి కుట్ర చేశాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి ఎన్నికల కమిషన్‌ సహకారం కూడా తీసుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఈ కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఏ రాష్ట్రంలోనూ జరగలేదు: మీనాక్షి

రాష్ట్రంలో 73 లక్షల ఓట్లు తొలగించడాన్ని, 64 లక్షల ఓట్లను అనామలీస్‌గా పెట్టడాన్ని చాలా సీరియ్‌సగా తీసుకోవాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ అన్నారు. ఇంత పెద్దఎత్తున ఏ రాష్ట్రంలోనూ ఓట్ల తొలగింపు జరగలేదన్నారు. ఇది బీజేపీ, ఎన్నికల కమిషన్‌ కలిసి చేస్తున్న కుట్రగా అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాలు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజిటల్‌ కాని, అనామలీస్‌ ఓట్లను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ‘‘భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఇవే ఓట్లు ఉంటాయి. ఇంత పెద్దఎత్తున తొలగింపు చాలా ప్రమాదకరం. తొలగించిన ఓట్లు, అనామలీస్‌ ఓట్లు కలిపి 1.30 కోట్ల వరకు ఉన్నాయి. ఈరోజు నుంచి నాయకులంతా సర్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని సూచించారు. ఎక్కడ చిన్న నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదని, పని చేయని కో ఆర్డినేటర్లను, బీఎల్‌ఏలను వెంటనే తొలగించి కొత్త వారిని నియమించాలని సూచించారు. నిర్లక్ష్యం చాలా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని, అప్రమత్తంగా ఉండి ఈ ఉపద్రవాన్ని అధిగమించాలని, నిర్లక్ష్యంగా ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. బెంగాల్‌ కంటే ఇక్కడ ఎక్కువ ఓట్లు తొలగించారని, ఇన్‌చార్జి మంత్రులు చాలా సీరియ్‌సగా పని చేయాలని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ అన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 05:44 AM