మీ ఓటు మీ చేతిలోనే!
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:35 AM
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కీలక దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియటంతో ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
ముసాయిదా జాబితాలో పేరు లేకున్నా భయం వద్దు
6, 7, 8 ఫారాలను సమర్పించి ఓటును కాపాడుకోవచ్చు
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కీలక దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియటంతో ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో జాబితాలో పేరు లేకుంటే ఏం చేయాలన్నదానిపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ముసాయిదాలో పేరు లేనంత మాత్రాన ఓటు హక్కు కోల్పోరని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అభ్యంతరాలు, అప్పీళ్ల ద్వారా ఓటును తిరిగి పొందవచ్చని చెప్పా రు. ఎన్నికల అధికారులు జారీ చేసిన నోటీసులకు సకాలంలో స్పందించాలని సూచిస్తున్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొనని, చిరునామా మార్చుకున్న, మరణించిన, డూప్లికేట్‌గా గుర్తించిన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగిస్తారు. ఈ పేర్లతో కూడిన ప్రత్యేకజాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వెబ్‌సైట్‌తోపాటు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఓటర్లు తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. పేరు లేకున్నా.. తమ వివరాలపై అభ్యంతరాలున్నా.. ఎన్నికల అధికారులు ప్రకటించే క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియలో పాల్గొని, అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఓటు హక్కు పదిలంగానే ఉంటుంది.
పాత ఎస్‌ఐఆర్‌తో లింక్ కాని వారికి నోటీసులు
ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత 2002 ఎస్‌ఐఆర్‌తో ప్రస్తుత ఓటరు వివరాలు సరిపోలని ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌వోలు), సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్‌వోలు) నోటీసులు జారీచేస్తారు. పాత ఎస్‌ఐఆర్ వివరాలతో ప్రస్తుత ఓటరును లింక్ చేయలేని సందర్భాల్లో.. గత ఎస్‌ఐఆర్‌కు ముందు సంబంధిత ఓటరు ఎక్కడ నివాసం ఉన్నారు.. వారి వివ రాలేంటి.. ఓటరుగా వారి అర్హతకు సంబంధించిన పరిస్థితులు ఏంటనే అంశాలపై విచారణ జరుపుతారు. సంబంధిత వ్యక్తి ఓటరుగా ఉండేందుకు అర్హుడని తేలితే ముసాయిదా జాబితాలో చేర్చుతారు. ఈఆర్‌వో, ఏఈఆర్‌వో నిర్ణయంతో సంతృప్తి చెందకపోతే ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి అప్పీల్‌ను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలి. అక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, దరఖాస్తుల సమర్పణ, పేర్ల సవరణ, మార్పులు చేర్పులు, కొత్త ఓటరు నమోదుకోసం 17 నుంచి సెప్టెంబరు 16 వరకు అవకాశం ఉంది. ఎన్నికల అధికారులు జారీచేసే నోటీసులకు వివరణ ఇచ్చేందుకు 17 నుంచి అక్టోబరు 15 వరకు అవకాశం కల్పించారు.
ఎవరు ఏ ఫారం సమర్పించాలి..?
ఫారం 6: గతంలో ఓటు ఉండి ప్రస్తుత ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు ఫారం- 6ను, డిక్లరేషన్‌ను సమర్పించాలి.
ఫారం 7: చిరునామా మారిన వ్యక్తి అంతకు ముందు నివసించిన అసెంబ్లీ నియోజకవర్గంలోని జాబితా నుంచి ఓటును తొలగించుకోవాలనుకున్నప్పుడు ఫారం-7ను సమర్పించాలి. మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించేందుకు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. శాశ్వతంగా వేరే చోటుకు వెళ్లిన వ్యక్తి కొత్త చిరునామా ఆధారాలను సమర్పించాలి.
ఫారం 8: ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తి తన వివరాల్లో మార్పులు చేయించుకునేందుకు ఫారం - 8ను సమర్పించాలి. చిరునామా మార్పు, వివరాల సవరణ, ఓటరు కార్డు మార్పు వంటి వాటికి ఈ ఫారం పూర్తిచేసి ఇవ్వాలి.