సర్‌లో కొత్త ఓటరు నమోదుకు 4.88లక్షల దరఖాస్తులు
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:19 AM
రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6 కింద 4,88,417 దరఖాస్తులు అందాయి
ఫారం-8 కింద 5.05 లక్షలు,
ఫారం-7 కింద 24,323
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6 కింద 4,88,417 దరఖాస్తులు అందాయి. వీటిలో 51,821 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించి ఓటరు జాబితాలో పేర్లు చేర్చామని ఎన్నికల విభాగాలు తెలిపాయి. ఫారం-6 దరఖాస్తులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల నుంచి అత్యధికంగా వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో ఫారం-6 కింద 1,94,204 దరఖాస్తులు అందాయి. వీటిలో 29,226 పేర్లు ఓటరు జాబితాలో చేర్చారు. రంగారెడ్డి జిల్లాలో 74,375 దరఖాస్తులు రాగా, 6,206 పేర్లు అప్‌డేట్ అయ్యాయి. మేడ్చల్- మల్కాజిగిరిలో 64,863 దరఖాస్తులు వచ్చాయి. నల్లగొండలో 8,380, నిజామాబాద్‌లో 15,668, సంగారెడ్డిలో 13,008, కరీంనగర్‌లో 8,756, వరంగల్‌లో 9,234 మంది కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6 దరఖాస్తులు సమర్పించారు. ఇక, ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు సంబంధించిన ఫారం-7 కింద రాష్ట్రవ్యాప్తంగా 24,323 దరఖాస్తులు అందాయి. ఇందులో 12,204 దరఖాస్తులపై చర్య పూర్తయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణలకు ఉపయోగించే ఫారం-8 కింద 5,05,159 దరఖాస్తులు రాగా.. ఇందులో 2,27,721 దరఖాస్తులు అప్‌డేట్ అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్నికల సంఘం ఆగస్టు 17న ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 27.95 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 12.54 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డిలో 24.12 లక్షల మందికిగాను 12.32 లక్షల ఓటర్లకు, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 19.07 లక్షలకుగాను 14.06 లక్షల ఓటర్లకు నోటిసులు జారీ చేశారు. అయితే, వీళ్లలో చాలామంది విచారణకు హాజరు కాలేదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం విడుదల చేసే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది.