Share News

కరెంట్‌ కనెక్షన్‌.. ఇక సులభం

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:54 AM

రాష్ట్రంలో కొత్తగా నిర్మించుకునే ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు కరెంట్‌ కనెక్షన్‌ తీసుకునే వారికి భారీ ఊరట లభించనుంది. గురువారం నుంచి కనెక్షన్‌ జారీ ప్రక్రియ మరింత సులభతరంకానుంది. ...

కరెంట్‌ కనెక్షన్‌.. ఇక సులభం

  • విద్యుత్‌ లైన్‌కు కిలోమీటర్‌లోపు ఉంటే ఎస్టిమేషన్లు ఉండవ్‌.. కనెక్షన్‌ సామర్థ్యం ఆధారంగా చార్జీలు చెల్లిస్తే చాలు ఇప్పటిదాకా ఒక్కోటి 5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 10 త్రీఫేజ్‌ మీటర్లు (50 కిలో వాట్లు) తీసుకోవాలంటే గంపగుత్తగా రూ.7 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి ఒక్కోటి 5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 10 త్రీఫేజ్‌ మీటర్లు (50 కిలోవాట్లు) తీసుకునేందుకు కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున రూ.5 లక్షలు చెల్లిస్తే చాలు. ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టాలి, స్తంభాలు తేవాలని అడగాల్సిన అవసరం లేదు.

  • ఇప్పటివరకు ఐదు కిలోవాట్ల దాకా త్రీఫేజ్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే 15 వేలు చెల్లించాలి. ఇకముందు కనీస చార్జీ 500. ఐదు కిలోవాట్లకు కలిపి 3 వే లు మొత్తంగా 3,500 చెల్లిస్తే చాలు.

  • వ్యవసాయ కనెక్షన్‌కు రూ.50తో రిజిస్ట్రేషన్‌ చేసుకొని దరఖాస్తు చేసుకున్నాక అంచనాలు రూపొందించిన తర్వాత రూ.4,950 చెల్లించాలి. ప్రభుత్వం రూ.50 వేలు సబ్సిడీగా ఇస్తుంది. ఒక రైతుకు 3 బోర్లకు కనెక్షన్‌ ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే రూ.50 వేలలో మూడు నుంచి 5 స్తంభాల వరకు ఇస్తారు. లైన్‌ దూరంగా ఉంటే మిగతా డబ్బును ఔట్‌రైట్‌ కంట్రిబ్యూషన్‌ (ఓఆర్‌సీ) కింద రైతులే చెల్లించాల్సి ఉండేది. క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం ప్రతి కనెక్షన్‌కు కనీసం రూ.20 వేలు లంచం రూపంలో, మరో రూ.20 వేలు ట్రాన్స్‌ఫార్మర్‌ ఇతరత్రా ఖర్చుల కోసం వసూలు చేస్తుంటారు. మొత్తంగా రూ.50 వేల వరకు వసూలు చేసేవారు. ఇక ముందు ఒక కనెక్షన్‌ కోసం కిలోవాట్‌కు రూ.1,000 చొప్పున ఐదు కిలోవాట్లకు రూ.5 వేలు చెలిస్తే కనెక్షన్‌ ఇవ్వాల్సిందే. కొత్త విధానంలో ఓఆర్‌సీ అడగడానికి వీల్లేదు.


హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా నిర్మించుకునే ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు కరెంట్‌ కనెక్షన్‌ తీసుకునే వారికి భారీ ఊరట లభించనుంది. గురువారం నుంచి కనెక్షన్‌ జారీ ప్రక్రియ మరింత సులభతరంకానుంది. తీసుకునే కరెంటు కనెక్షన్‌ సామర్థ్యం ఆధారంగా చార్జీలు చెల్లిస్తే కనెక్షన్‌ ఇవ్వాల్సిందే. కరెంటు లైన్‌కు కిలోమీటర్‌లోపు అపార్ట్‌మెంట్‌/నివాస సముదాయం ఉన్నట్లయితే కరెంటు సామర్థ్యం ఆధారంగా చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. అపార్ట్‌మెంట్‌ విద్యుత్‌ వినియోగం 25 కిలోవాట్ల లోడు దాటితే ప్రతి కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున 25 కిలోవాట్లకు రూ.2.5 లక్షలు చెల్లిస్తే చాలు. ఆ అపార్ట్‌మెంట్‌కు అవసరమైన లైన్లు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు బాధ్యత డిస్కమ్‌దే. అయితే నివాస సముదాయం కరెంటు లైన్‌కు కిలోమీటరుకంటే ఎక్కువ దూరంలో ఉంటే కనెక్షన్‌ ఇచ్చేందుకు అవసరమైన లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాలు, కూలీల ఖర్చు తదితరాలు వినియోగదారుల నుంచే డిస్కమ్‌లు వసూలు చేస్తాయి. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎస్టిమేషన్ల (అంచనాలు) పేరిట డిస్కమ్‌ల ఉద్యోగులు, అధికారులు దందాలు చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇకపై ఎస్టిమేషన్ల దందాకు తెరపడే అవకాశం ఉంది. ఈమేరకు రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు భారీగా ఉపశమనం కల్పిస్తూ లైసెన్సీ డ్యూటీ ఫర్‌ సప్లై ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఆన్‌ రిక్వె్‌స్ట-రెండో సవరణ రెగ్యులేషన్‌-2026ను తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) జారీ చే సింది. గురువారం నుంచి ఇది రాష్ట్రంలో అమల్లోకి కానుంది. కమిషన్‌ జారీ చేసిన రెగ్యులేషన్‌-1పై గెజిట్‌ జారీ కాగా రెండు డిస్కమ్‌లు (టీజీఎన్పీడీసీఎల్‌-హన్మకొండ, టీజీఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌) అమలు చేయనున్నాయి.

రైతులకు ప్రయోజనం..

ఇకపై రైతులు కిలోవాట్‌కు రూ.1,000 చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్‌ కావాలనుకుంటే ఆమేరకు చార్జీలు చెల్లిస్తే కరెంట్‌ కనెక్షన్‌ ఇస్తారు. దీంతో అదనపు చార్జీలు, విద్యుత్‌ సిబ్బంది చేతివాటం నుంచి రైతులకు ఉపశమనం లభించనుంది. ఇప్పటి వరకున్న విధానం ప్రకారం.. వ్యవసాయ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే రైతు పొలంలో ఉన్న మోటారు నుంచి మూడు విద్యుత్‌ స్తంభాలలోపు ఉంటే కనెక్షన్‌ ఇస్తున్నారు. మూడు స్తంభాలు దాటితే ఔట్‌ రైట్‌ కంట్రిబ్యూషన్‌ (ఓఆర్‌సీ) కింద రైతు విద్యుత్‌ సంస్థలకు రూ.45వేలకు పైగా చెల్లించాల్సి వస్తోంది. కొత్తఉత్తర్వుల ప్రకారం ఈ భారం రైతులపై పడదు.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం..

వినియోగదారులకు విద్యుత్‌ను అందించడానికి వీలుగా 150 కిలోవాట్లలోపు లేదా ఆ పైన లోడు కోసం కొత్తగా సరఫరా వ్యవస్థకు వెచ్చించిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ డిస్కమ్‌లకు 2020లో ఆదేశాలిచ్చింది. ఈమేరకు రెగ్యులేషన్‌ను సవరించాలని డిస్కమ్‌లు ఏడాది క్రితం ఈఆర్‌సీని కోరాయి. ఈ నిబంధనల అమలు తర్వాత కనెక్షన్ల జారీ ప్రక్రియ వల్ల నష్టం జరిగిందని డిస్కమ్‌లు నిర్ధారణకు వస్తే.. తదుపరి వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌) పిటిషన్‌లో ట్రూ-అప్‌ కింద వాస్తవిక వ్యయాన్ని రాబట్టుకోవడానికి వీలు కల్పించనున్నారు.

Updated Date - Feb 05 , 2026 | 06:56 AM