బడుగుల గుండెలకు సిగాచి సెగ!
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:33 AM
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడుతో సంభవించిన ఘోరకలి గుర్తుందా? రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కార్మికులు ఆ ప్రమాదంలో సజీవదహనమయ్యారు.
పరిశ్రమలో ఘోరకలికి రేపటితో ఏడాది.. డ్రయర్ పేలుడులో విధుల్లో ఉన్న 54 మంది కార్మికుల దుర్మరణం
మృతుల కుటుంబాలకు దక్కని పూర్తి పరిహారం
అప్పట్లో పరిహారం ఇప్పిస్తానన్న సీఎం రేవంత్
రూ.కోటి చొప్పున ఇస్తామని చెప్పి రూ.25 లక్షలే ఇచ్చిన పరిశ్రమ యాజమాన్యం
పరిహారం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పలుమార్లు క్షతగాత్రుల ఆందోళనలు
రేపు బీఆర్‌ఎస్ ఆధ్వర్వాన మృతుల సంస్మరణ సభ
పటాన్‌చెరు రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడుతో సంభవించిన ఘోరకలి గుర్తుందా? రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కార్మికులు ఆ ప్రమాదంలో సజీవదహనమయ్యారు. కొందరివైతే మృతదేహాలే లభించలేదు. ఎముకలు, ఇతర అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించాల్సిరావడం ప్రమాదతీవ్రతను చాటిచెబుతుంది.. తమవాళ్లు ప్రాణాలు కోల్పోవడం మృతుల కుటుంబాలకు పూడ్చలేని లోటు అయినా పరిశ్రమ యాజమాన్యం అందజేసే పరిహారంతో బిడ్డలను పోషించుకోవొచ్చునని మృతుల కుటుంబాలు ఆశించాయి! అయితే సిగాచి ప్రమాదం జరిగి మంగళవారంతో సరిగ్గా ఏడాది కావొస్తున్నా వారి ఈ ఆశ తీరలేదు. బాధిత కుటుంబాలకు పరిహారం దక్కలేదు. అరకొర పరిహారాన్ని విదల్చడం ద్వారా పరిశ్రమ యాజమాన్యం చేతులు దులిపేసుకుంది. ఫలితంగా సిగాచి మిగిల్చిన గాయంతో పాటు పరిహారం పేరిట పరిశ్రమ యాజమాన్యం చేసిన పరిహాసం బాధిత కుటుంబాల గుండెలను ఇంకా పిండేస్తూనే ఉంది. నిరుడు జూన్ 30న సిగాచిలో స్ర్పే డ్రయర్ పేలుడు సంభవించింది. విధుల్లో ఉన్న 54 మంది మృతిచెందారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిశ్రమ యాజమాన్యం ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పిస్తానని ప్రకటించారు. అయితే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించిన యాజమాన్యం రూ.25 లక్షల చొప్పున మాత్రమే చెల్లించింది. పీఎఫ్, ఈఎ్‌సఐ, ఇన్సూరెన్స్‌ల ద్వారా కొన్ని కుటుంబాలకు యాజమాన్యం చెల్లించిన రూ.25 లక్షలతో కలిపి రూ.42 లక్షల వరకు అందింది. మృతదేహాలు లభించని ఎనిమిది మందితోపాటు మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష అందలేదు. ప్రమాదం కారణంగా బాధిత కుటుంబాల్లో చాలామటుకు ఏకైక ఆధారాన్ని కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ఇంటి అద్దె, పిల్లల పోషణ, వారి చదువులు భారమైపోయాయి. పరిహారం కోసం ఏడాదిగా బాధితులు.. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది.
కాగా గాయాలపాలైన బాధితులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక నరకయాతన పడుతున్నారు. ఇక మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని పరిశ్రమ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపు విషయంలో వైఖరి చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు జారీచేసింది. కేసులో ఈపీఎఫ్ వో రీజినల్ కమిషనర్‌ను, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలను ప్రతివాదులుగా చేర్చింది. సిగాచి పరిశ్రమ పేలుడు బాధితులకు పరిహారం ఇవ్వడంతోపాటు దర్యాప్తు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్రాంత శాస్త్రవేత్త కలపాల బాబూరావు దాఖలు చేసిన పిల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అమికస్ క్యూరీ డొమినిక్ ఫర్నాండేజ్ వాది స్తూ పరిహారం చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. ఈపీఎ్‌ఫవో నుంచి రావాల్సిన పరిహారంలో సైతం వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. రూ.45.61 కోట్లు ఇప్పటికే చెల్లించామని, ఇంకా రూ.6.05 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని సిగాచి కంపెనీ న్యాయవాది కోర్టుకు చెప్పడం గమనార్హం. మృతుల కుటుంబాలకు పరిహారం దక్కకపోగా. 54 మంది ని బలిగొన్న ఇంతటి ఘోర ప్రమాదానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఇంతటి నిర్లక్ష్యానికి కారణమెవ్వరు? అనేది అధికారులు ఇంకా తేల్చనేలేదు. కాగా మృతుల సంస్మరణ సభను మంగళవారం నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ పేర్కొంది.

మా డబ్బులు మాకే లెక్కల్లో చూపిస్తున్నారు
మేము అద్దె ఇంట్లో ఉంటాం. ప్రమాదానికి ముందురోజే ఇల్లు మారాం. ఇంట్లో సామాను అలాగే ఉంది. ఆయన డ్యూటీ నుంచి ఫోన్‌చేసి ‘నేను వచ్చాక సద్దుదాం. ఇబ్బంది పడకు’ అని చెప్పారు. ఆయన డ్యూటీకి వెళ్లేటప్పటికే పరిశ్రమలో బాగా వేడి ఉందంట. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇప్పటివరకు అందిన సొమ్ములో కార్మికులకు చట్టం ప్రకారం రావాల్సిన ఈఎ్‌సఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలిపి పరిహారంగా చూపిస్తున్నారు. నా భర్త కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా కంపెనీ ఇచ్చిన పరిహారం కింద ఎలా లెక్కగడతారు? రూ.25 లక్షలతో పిల్లలను ఎలా చదివించాలి? మా కుటుంబం ఎలా నడవాలి?
- హేమలత, మృతుడు నాగేశ్వరరావు భార్య

ఏడాదిగా నరకం అనుభవిస్తున్నా ..
నేను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డా. కాలిన గాయాలతో ఏడాదిగా నరకం అనుభవిస్తున్నా. ప్రమాద సమయంలో క్యూ సీ విభాగంలో కెమిస్ట్రీగా విధి నిర్వహణలో ఉన్నాను. పేలుడు కారణంగా దట్టమైన పొగ మంటలు అలుముకున్నాయి. కార్మికుల ఆర్తనాదాలు వినిపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తోటి కార్మికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాను. కానీ నా చేతికి, ముఖానికి తీవ్రగాయాలు కావడంతో అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆస్పత్రి ఖర్చులు భరించడం కష్టంగా ఉంది.
- సుష్మ, కార్మికురాలు