ఓ తల్లి విజయం..!
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:33 AM
వాళ్లంతా అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు! పటాన్‌చెరు, రుద్రారం పారిశ్రామికవాడల్లో పని చేసుకుంటున్నారు...
గర్భంలోనే శిశువుకు రేటు కట్టిన శిశు విక్రయ ముఠా
బిడ్డను ఇస్తే రూ.5 లక్షలు ఇచ్చేందుకు తల్లి, భర్తతో ఒప్పందం
పుట్టిన తర్వాత బిడ్డను ఇచ్చేందుకు తల్లి ససేమిరా.. 100కు ఫోన్
పోలీసులు వచ్చి బిడ్డను తల్లికే అప్పగించడంతో వెలుగులోకి
పటాన్‌చెరు, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వాళ్లంతా అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు! పటాన్‌చెరు, రుద్రారం పారిశ్రామికవాడల్లో పని చేసుకుంటున్నారు! వీరినే లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా శిశు విక్రయాలకు తెరలేపింది! విచిత్రంగా.. ఈ ముఠా కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిందే! రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద గర్భిణులను ఈ ముఠా గుర్తిస్తుంది! గర్భంతో ఉండగానే వారితో ఒప్పందం కుదుర్చుకుంటుంది! ఆస్పత్రి ఖర్చులు భరిస్తోంది! బిడ్డ పుట్టిన తర్వాత కన్నవారి మనసు మారిపోతుందనే భయంతో.. పొత్తిళ్లలో ఉండగానే శిశువును తీసుకుని సరిహద్దులు దాటించేస్తుంది! ఓ తల్లి మాతృత్వపు మమకారం ముందు ఈ అక్రమ దందా ఓడిపోయింది! పొత్తిళ్లలో ఉన్న బిడ్డను దళారులకు అప్పగించడానికి ఓ తల్లి నిరాకరించడం.. 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచీ..
పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడల్లో పని చేయడానికి పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలతోపాటు వాటి సరిహద్దుల్లోని బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచీ అక్రమ వలసదారులు వస్తారు. బార్డర్ దాటిన తర్వాత అక్కడి రాష్ట్రాల్లోనే ఆధార్ కార్డులు తయారు చేసుకుంటున్నారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పటాన్‌చెరు, రుద్రారం పారిశ్రామికవాడలకు చేరుకుంటున్నారు. ఇలాంటి అక్రమ వలసదారులు, మన దేశంలోని సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని లక్ష్యం గా చేసుకుని ఓ ముఠా శిశు విక్రయాల దందా చేస్తోంది. రుద్రారం, ఇస్నాపూర్, చిట్కుల్, ముత్తంగి, పటాన్‌చెరు ప్రాంతాల్లోని ప్రవేటు క్లినిక్‌లతో కుమ్మక్కై మానవ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. తొలుత, నిరుపేద గర్భిణుల కుటుంబాలతో పరిచయాలు పెం చుకుని, డబ్బులు ఎరగా చూపుతోంది. పుట్టిన పిల్లలను విక్రయిస్తే లక్షన్నర నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటోంది. అడ్వాన్స్‌గా రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తోంది. పుట్టిన వెంటనే శిశువును స్వాధీనం చేసుకుని, మిగిలిన డబ్బులు చెల్లించి దేశ సరిహద్దులకు తరలిస్తోంది.
తలొగ్గని మాతృత్వపు మమకారం..
రుద్రారంలో గ్రామంలో ఓ 17 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమె వద్ద అసోంలో జారీ చేసిన ఆధార్ కార్డు ఉంది. ఇటీవల ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆమె గర్భిణిగా ఉన్నప్పుడే తల్లి, భర్త శిశు విక్రయాల ముఠాతో ఒప్పందం చేసుకున్నారు. కానీ, పుట్టిన తర్వాత బిడ్డను ఇవ్వడానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. అడ్వాన్స్ ఇచ్చిన ముఠా సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టి హింసించారు. దీంతో, ఆ మైనర్ తల్లి సాయం కోసం చుట్టుపక్కల వారిని వేడుకుంది. రక్షణ కోసం ఆమె 100 నంబర్‌కు ఫోన్ చేసింది. ఏఎస్ఐ స్థాయి అధికారి సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బిడ్డను తల్లికి అప్పగించారు. కానీ, ముఠాపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. ఘటనపై కనీసం కేసు నమోదు చేయకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.