విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా!
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:17 AM
వచ్చే సీజన్లో కొనుగోళ్లు సాఫీగా సాగేలా.. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రైతు సంక్షేమానికి ఉన్నతాధికారుల కమిటీ.. రైతులు, పంటల వివరాలు కచ్చితంగా నమోదు
రైతు వేదికల్లోనే విత్తనాలు, ఎరువులు
సబ్సిడీపై 7 రకాల సన్న వడ్ల విత్తనాలు
ఎరువుల కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తేవాలి
ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం
వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే సీజన్లో కొనుగోళ్లు సాఫీగా సాగేలా.. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పని చేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, పౌర సరఫరాల మేనేజింగ్ డైరెక్టర్, ప్లానింగ్ విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారని చెప్పారు. విత్తనాల పంపిణీ మొదలు పంట వేసినప్పటి నుంచే అన్ని గ్రామాల్లో రైతులు, పంటల వివరాల నమోదు, పంట ఉత్పత్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టా ల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంతోపాటు అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుందని చెప్పారు. ఏ రైతు ఏ పంట వేశాడు.. ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలను క్షేత్ర స్థాయి పరిశీలనతో కచ్చితంగా నమోదు చేయాలని నిర్దేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లోని బోధి పెవిలియన్‌లో మంగళవారం ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. రైతు వేదికలను ఇకనుంచి రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ‘‘రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకోవాలి. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతోపాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి ఉండాలి. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలి’’ అని నిర్దేశించారు. వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచుకోవడంతోపాటు ఏఐ ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలని సూచించారు. వ్యవసాయ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాలు, వ్యవసాయ వర్సిటీ కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేయాలని, రైతులకు ఉపయోగంగా ఉంటే మరింత విస్తృతం చేయాలని చెప్పారు. రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతోపాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ‘‘సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలి. వీటిని సబ్సిడీపై రైతులకు ఇవ్వాలి. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా ేసకరించాలి. ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలి’’ అని స్పష్టం చేశారు.
అన్ని రకాల ఎరువుల బుకింగ్‌కు యాప్
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించి రాష్ట్రంలో కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి సూచి ంచారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో అత్యధికం తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్దేశించారు. ఎరువులపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలని సూచించారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సూచించారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ నిర్దేశించారు. ప్రభుత్వ వ్యూహాత్మక అడుగులతో మొక్కజొన్న కొనుగోళ్లలో నష్టం తగ్గిందని, గతంలో రూ.13 వేలకు టన్ను అమ్మితే.. ఈసారి దాదాపు రూ.21 వేలకుపైగా ధర వచ్చిందని గుర్తు చేశారు. ఆయిల్ ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల దిశలో నడిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డైరీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు, రైతులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్, వ్యవసాయ వర్సిటీ, నిపుణులు ఇచ్చిన సలహా సూచనలను సమావేశంలో చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.