యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:18 AM
ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించి నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
ఈ సీజన్‌లో 152 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా
వ్యవసాయ రంగ చరిత్రలో సరికొత్త రికార్డు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించి నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ పంటకాలంలో 54.48 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నామని, ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సోమవారం పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. 2025-26 యాసంగిలో ధాన్యం దిగుబడి వ్యవసాయ రంగ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుందని తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సమగ్ర కార్యాచరణను రూపొందించామని, ఇందులో 60 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం, 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉంటుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల పెంపుతోపాటు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి ఆదేశించారు. వేసవి తీవ్రతను దృష్ట్యా రైతాంగానికి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.