విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు!
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:59 AM
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. గృహ వినియోగంతో పాటు రాష్ట్రంలో ఐదు చోట్ల ఎత్తిపోతల పథకాల పంపులు నడుస్తుండటం..
18,139 మెగావాట్లుగా నమోదు
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. గృహ వినియోగంతో పాటు రాష్ట్రంలో ఐదు చోట్ల ఎత్తిపోతల పథకాల పంపులు నడుస్తుండటం.. వ్యవసాయ పంపులు కూడా 24 గంటల పాటు పనిచేస్తుండటంతో రికార్డుస్థాయిలో డిమాండ్ నమోదయింది. మంగళవారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 18,139 మెగావాట్లుగా రికార్డయింది. గతేడాది మార్చి 20వ తేదీన గరిష్ఠ డిమాండ్ 17,162 మెగావాట్లు కాగా.. ఆ రికార్డులన్నీ చెరిపేస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది. వాస్తవానికి పది రోజులుగా విద్యుత్ డిమాండ్(విద్యుత్ ఉపకరణాల సామర్థ్యం/వినియోగం ఆధారంగా) భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రబీలో వరినాట్లు వేస్తున్నారు. ఇక గృహ విద్యుత్ వినియోగం కూడా భారీగా నమోదవుతుంది. విద్యుత్ రంగం మరోసారి తన ప్రగతిని చాటుకుందని, భారీ డిమాండ్ నమోదెనా అటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులు, కార్మికులకు అభినందనలు తెలిపారు.