పంట కొనుగోళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శం
ABN , Publish Date - May 02 , 2026 | 05:02 AM
పంట కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ...
గన్నీ బ్యాగుల సమస్యకు త్వరలోనే పరిష్కారం: తుమ్మల
హైదరాబాద్, మే 1(ఆంధ్రజ్యోతి): పంట కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఆయన మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులతో పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే భారాన్ని భరించి మద్దతు ధరకు పంటలను ేసకరిస్తున్నట్టు వివరించారు. కేంద్రం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేస్తూ ఏడాదికి రూ.2000 నుంచి రూ.3000 కోట్ల భారాన్ని భరిస్తుందన్నారు. 2025-26 వానాకాలంలో రూ.903 కోట్లతో 3.77 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, ఈ యాసంగిలో ఇప్పటివరకు రూ.1044 కోట్లతో 4.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని గణాంకాలతో వివరించారు. కొన్ని చోట్ల గన్నీ బ్యాగుల కొరత, డీజిల్ కొరతతో ఇబ్బందులున్నాయని, ముడి జూట్ ధరలు పెరగడం వల్ల కొరత ఏర్పడిందని, త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. మరోవైపు ఆదిలాబాద్, తుప్రాన్ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సేంద్రియ ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ తీసుకురానుంది. టీజీ ఆర్గానిక్స్ యాప్‌ను ఈనెల నాలుగో తేదీన వికారాబాద్ జిల్లా తాండూరులో మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ కలిగించటానికి, వినియోగదారులకు నమ్మకం కలిగించటానికి ఉపయోగపడుతుందనితుమ్మల తెలిపారు.
మా భూములు కాపాడండి
జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు చెందిన భూమిని మూసీ అభివృద్ధికి తీసుకోవద్దని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు ఆ సంస్థ డైరెక్టర్ సి.తారా సత్యవతి లేఖ రాశారు. పరిశోధనా సంస్థకు చెందిన 10.38 ఎకరాల భూమికి ఏప్రిల్ 30న మూసీ అధికారులు మార్కింగ్ చేయడంపై పరిశోధనా సంస్థ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్న నేపథ్యంలోనే మార్కింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.