Share News

ధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు పూర్తవ్వాలి

ABN , Publish Date - May 25 , 2026 | 04:57 AM

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు పూర్తవ్వాలి

  • ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని 72 గంటల్లోగా కొనాలి

  • తర్వాత వచ్చే ధాన్యానికి 10 రోజుల్లోగా చెల్లింపులు పూర్తవ్వాలి

  • తడిసిన ధాన్యాన్ని కొని వెంటనే బాయిల్డు మిల్లులకు తరలించాలి

  • రోజుకు 3లక్షల టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకోవాలి

  • ఇప్పటివరకు 51లక్షల టన్నులు కొన్నాం లక్ష్యం 75 లక్షల టన్నులు

  • అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు.. 10 రోజుల ప్రణాళిక ప్రకటన

హైదరాబాద్‌ మే 24 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్‌కుమార్‌ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ఉత్తమ్‌ 10 రోజుల ప్రణాళికను ప్రకటించారు. మార్కెట్‌ యార్డులకు వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన 8.50లక్షల టన్నుల ధాన్యాన్ని 72 గంటల్లోగా కాంటా పూర్తి చేసి లోడ్‌ చేయాలన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే 16లక్షల టన్నుల ధాన్యాన్ని 10 రోజు ల్లో కాంటా పూర్తిచేసి రైతులకు చెల్లింపులు చేయాలన్నారు. రోజుకు 3 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులకు టార్గెట్‌ పెట్టారు. ఇందుకోసం రాత్రి పూట కూడా ధాన్యం కొనుగోళ్లు జరగాలని, గోదాముల సామర్థ్యాన్ని 7లక్షల టన్నుల మేర పెంచుతున్నామని వెల్లడించారు. ఈ వర్చువల్‌ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, జిల్లాల కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


కేంద్రం అనుమతిచ్చింది 52లక్షల టన్నులకే

రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 51లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఉత్తమ్‌కుమార్‌ తెలిపారు. ఇందుకు గాను రైతులకు రూ.8,749కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రం లో ప్రస్తుత సీజన్‌లో 141లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయిందని, ఇందులో 75లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52లక్షల టన్నుల సేకరణకు మాత్రమే అనుమతి ఇచ్చిందని ఉత్తమ్‌కుమార్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. తాలు, తరుగు పేరుతో రైస్‌ మిల్లర్లు, దళారులు రైతులను మోసం చేేస్త వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. రైతులకు నగదు చెల్లింపు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, వెంటనే ఆ ధాన్యాన్ని బాయిల్డు మిల్లులకు తరలించాలని సూచించారు. నిజామాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ, నారాయణపేట, ఖమ్మం జిల్లాలు ధాన్యం సేకరణలో ముందంజలో ఉన్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కాగా, వరి ధాన్యం కొనుగోలు విషయంలో తప్పుడు ప్రచారాలను ఖండించాలని, రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న విషయాన్ని ప్రజలకు చేరవేయాలని చేయాలని ఉత్తమ్‌ ఆదేశించారు.

మహిళా సంక్షేమ వారంపై మంత్రి సీతక్క సమీక్ష

ఉత్తమ్‌ సమీక్ష అనంతరం ఇదే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు శాఖకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 25 నుంచి 30 వరకు నిర్వహించనున్న ‘మహిళా సంక్షేమ వారం’ పై చర్చించారు. గ్రామ,మండల స్థాయిలో ఇందిరా మహిళాశక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన, మహిళల భద్రత, పోష్‌ చట్టంపై అవగాహన కల్పించడం, సోలార్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపన, మహిళ మండల సమాఖ్య ప్రత్యేక సమావేశాల నిర్వహణ, ఉల్లాస్‌ కార్యక్రమం, అమ్మ మాట- అంగన్వాడీ బాటపై కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Updated Date - May 25 , 2026 | 04:57 AM