పంట రుణాల లక్ష్యం 96,920 కోట్లు
ABN , Publish Date - May 23 , 2026 | 04:39 AM
వచ్చే వానాకాలం, యాసంగి పంట కాలాలకు కలిపి రూ.96,920 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ....
గత ఏడాదితో పోలిస్తే 8.29శాతం పెరిగిన రుణ లక్ష్యం.. మొత్తం సాగు రంగానికి రూ.1.81 లక్షల కోట్లు
2026- 27 రుణ ప్రణాళిక వెల్లడించిన ఎస్‌ఎల్‌బీసీ
సున్న వడ్డీ రుణాలు రూ.10 లక్షలకు పెంపు: భట్టి విక్రమార్క
బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు కూడా ఇవ్వాలి: తుమ్మల
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): వచ్చే వానాకాలం, యాసంగి పంట కాలాలకు కలిపి రూ.96,920 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్‌బీసీ) ప్రకటించింది. 2026-27 సంవత్సరానికిగాను పంట రుణాల పంపిణీ లక్ష్యాన్ని శుక్రవారం వెల్లడించింది. జూన్ ఒకటో తేదీ నుంచి వానాకాలం సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో.. రైతులకు పంట రుణాలు పంపిణీచేసేలా క్షేత్రస్థాయికి ఉత్తర్వులు జారీచేసింది. అయితే గత ఏడాది పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.89,500 కోట్లు కాగా.. ఈసారి రుణాల పంపిణీ లక్ష్యం రూ.7,420 కోట్లు(8.29శాతం) పెరగటం గమనార్హం.రుణ ప్రణాళికలో గత ఏడాది పంట రుణాల వాటా 10.40శాతం కాగా, ఈసారి 9.97 శాతంగా నిర్ణయించారు. రుణాల వాటా శాతం తగ్గినప్పటికీ.. రుణ లక్ష్యం మాత్రం పెరిగింది. ఇదిలాఉండగా వ్యవసాయరంగంలో దీర్ఘకాలిక రుణాల(అగ్రి టర్మ్ లోన్లు) పంపిణీ లక్ష్యం రూ. 57,192 కోట్లు కాగా, వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రూ.7,797 కోట్లు, పశుపోషణ, పాలు, మాంసం ఉత్పత్తి, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, కోడిగుడ్ల ఉత్పత్తి తదితర వ్యవసాయ అనుబంధరంగాలకు రూ.19,126 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం కలిపి వ్యవసాయరంగానికి రూ. 1,81,035 కోట్ల రుణాలు పంపిణీ చేస్తామని ఎస్‌ఎల్‌బీసీ ప్రణాళికలో వెల్లడించింది. సూక్ష్మ పరిశ్రమలకు రూ.72,665 కోట్లు, చిన్న పరిశ్రమలకు రూ.82,152 కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ.75,674కోట్లు రుణ ప్రణాళికలో కేటాయించారు. ఇవికాకుండా విద్యారంగానికి రూ.2,026 కోట్లు, గృహనిర్మాణ రంగానికి రూ. 12,446 కోట్లు, ఇతర రంగాలకు రూ.7,367 కోట్లు కేటాయించారు. మొత్తమీద ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.21,839 కోట్లు, అప్రాధాన్య రంగాలకు రూ. 5,38,238 కోట్లు కేటాయించారు. మొత్తం కలిపి 2026-27 వార్షిక రుణ ప్రణాళిక రూ.9,72,253 కోట్లు కావటం గమనార్హం. గత ఏడాది మొత్తం రుణ ప్రణాళిక రూ.8,60,451కోట్లుకాగా.. ఈసారి రూ.1,11,801 కోట్లు అదనంగా పెంచారు.
త్వరలో పరిశ్రమల హబ్‌లు, క్లస్టర్లు
రాష్ట్రంలో త్వరలోనే అనేక పరిశ్రమల హబ్‌లు, క్లస్టర్లను తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివెల్లడించారు. ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్, లెదర్, టెక్స్‌టైల్ రంగాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రుణలక్ష్యం రూ.1,65,297 కోట్లు ఉంటే.. రూ.1,68,401 కోట్లు (101.88ు) పంపిణీ చేయటం హర్షణీయమన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బ్యాంకులు కృషిచేయాలని సూచించారు. వ్యవసాయ రుణాల్లో అధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే పరిమితమవుతున్నారని, దీర్ఘకాలిక రుణాలు కూడా ఇవ్వాలని ఆయన కోరారు.