2028 జూన్ కల్లా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:11 AM
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ పనులను అడ్వాన్స్ టన్నెలింగ్ మెథడ్(డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం)లో 2028 జూన్ 30కల్లా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
ప్రభుత్వం తాజా టార్గెట్
నీటిపారుదల శాఖలో జియాలజీ చేసిన వారి కోసం వేట
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ పనులను అడ్వాన్స్ టన్నెలింగ్ మెథడ్(డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం)లో 2028 జూన్ 30కల్లా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఏడాది కిందట టన్నెల్ ఇన్‌లెట్(శ్రీశైలం) వైపు పై కప్పు కూలి పనులు ఆగిపోయిన విషయం విదితమే. ఆ ఘటనతో రెండు వైపులా ఉన్న టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం)ను పూర్తిగా తొలగించారు. టీబీఎంతో ఇక టన్నెల్ తవ్వడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానాలే అమలు చేయాలని భావించిన డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖలో జియాలజీలో పీజీ చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ)/అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ)ల వేటలో సర్కారు నిమగ్నమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వీరిని డిప్యుటేషన్ ప్రాతిపదికన ఎస్‌ఎల్‌బీసీ పనుల కోసం వినియోగించుకోనుంది. దీని కోసం ఎస్‌ఎల్‌బీసీ పేరుతో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్వతంత్ర కన్సల్టెంట్‌ను నియమించుకోవడంతో పాటు సింగరేణి సేవలను కూడా వినియోగించుకోనున్నారు.