నేటి నుంచి స్వీయ జనగణన
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:47 AM
జనగణనలో భాగంగా పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు (స్వీయ గణన) చేసుకొనే ప్రక్రియను రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు జనగణన...
వచ్చే నెల 10వ తేదీ వరకు అవకాశం.. ప్రత్యేక పోర్టల్‌లో సులువుగా వివరాల నమోదు
ఆన్‌లైన్‌లో 15 - 20 నిమిషాల్లో పూర్తి
నివాసం ఉన్న చోటే వివరాలు నమోదు చేసుకోవాలి
జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతి హోళికేరి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): జనగణనలో భాగంగా పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు (స్వీయ గణన) చేసుకొనే ప్రక్రియను రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. ఈ అవకాశం వచ్చే నెల 10వ తేదీ వరకు ఉంటుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో స్వీయ జనగణనకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం భారతి మాట్లాడు తూ.. స్వీయ గణనలో తెలంగాణ పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సందేహాలుంటే 1855 నెంబరుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. 15 నుంచి 20 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో స్వీయ జనగణన పూర్తి చేయవచ్చని తెలిపారు. 33 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
మే 11 నుంచి హెచ్‌ఎల్‌వో
జనగణన మొదటి విడతలో భాగంగా కాలనీలు, బస్తీలు, వార్డు/గ్రామం, మండలం వారీగా హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్‌ఎల్‌బీ)ల మ్యా పింగ్ పూర్తయ్యిందని భారతి హోళికేరి చెప్పారు. మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు నిర్వహించే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్‌ఎల్‌వో)లో భాగంగా బ్లాకులవారీగా ఇళ్లకు నెంబర్లు కేటాయిస్తామన్నారు. ఇందు లో భాగంగా కుటుంబ యజమాని, ఇంటిలోని సదుపాయాలతోపాటు మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించి సమాచారం సేకరిస్తామని తెలిపారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత వివరాల సేకరణ ఉంటుందని వివరించారు. స్థానికులతోపాటు విదేశీయులు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు కూడా ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనాలని సూచించారు. జనగణన డాటా.. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని, పౌరుల వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని భారతి చెప్పారు. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు నెంబర్లు, ఇతర డాక్యుమెంట్లను ఎన్యుమరేటర్లు అడగరని చెప్పారు. సమాచారం ఇవ్వకుంటే చట్ట ప్రకారం జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.
స్వీయగణన ప్రక్రియ ఇలా..
https://se.census.gov.in పోర్టల్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.
రాష్ట్రం (తెలంగాణ) ఎంపిక చేసి.. దిగువన కనిపించే క్యాప్చా ఎంటర్ చేయాలి.
కుటుంబ యజమాని పేరు నమోదు చేయాలి. యజమాని పేరు ఒక్కసారినమోదు చేస్తే సవరణకు అవకాశం ఉండదు.
కుటుంబంలోని ఎవరిదైనా మొబైల్ నెంబరుఎంటర్ చేయాలి. ఒక మొబైల్ నెంబరుతో ఒక కుటుంబం వివరాల నమోదుకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఈ మెయిల్ ఎంటర్ చేయాలి (ఆప్షనల్). అనంతరం మొబైల్ నెంబరుతోపాటు ఈ మెయిల్‌కు ఐడీ నెంబరు వస్తుంది.
కావాల్సిన భాషను ఎంచుకొని.. పైన ఎంటర్ చేసిన మొబైల్ నెంబరుకు వచ్చే వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ)ఎంటర్ చేయాలి. ఒకసారి భాష ఎంచుకున్న తర్వాత మార్చడం కుదరదు.
జిల్లాను ఎంచుకొని పిన్‌కోడ్, గ్రామం/నగరం, ప్రాంతం, స్థానిక ల్యాండ్‌మార్క్ ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి.
ఆయా వివరాల ఆధారంగా కనిపించే మ్యాప్‌లో ఎర్రటి రంగులో కనిపించే మార్కర్ ద్వారా మీ ఇళ్లు ఎక్కడ ఉందో సరిగా గుర్తించాలి. (భవనంపై మార్కర్ ఉండేలా ఎంచుకోవాలి). వివరాలు సేవ్ చేసి నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. ఇది ఎన్యుమరేటర్ క్షేత్రస్థాయి ప ర్యటనలో మీ ఇంటికి సులువుగా వచ్చేందుకు దోహదపడుతుంది.
అనంతరం 33 అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇందులో 27 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. భవనం నెంబరు, సెన్సస్ హౌస్ నెంబరు వంటి ఆరు ప్రశ్నలకు సంబంధించి ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలి.
మీరు ఇచ్చిన సమాచారం సరిగా ఉందా..? లేదా..? అన్నది ప్రివ్యూ ఆప్షన్‌పై క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి.
అంతా సక్రమంగా ఉందనుకుంటే ఫైనల్ సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. సవరణ కావాలంటే ఎన్యుమరేటర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇంటికి వచ్చినప్పుడు చేసుకోవాలి.
ఫైనల్ సబ్‌మిట్ చేసిన తర్వాత హెచ్ అనే అక్షరంతోపాటు 11 అంకెలతో ఐడీ నెంబరు మొబైల్ నెంబరు/ఈ మెయిల్‌కు వస్తుంది.
ఈ గుర్తింపు సంఖ్యను ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే యాప్‌లో చెక్‌చేసి.. మీ వివరాలకు సంబంధించిన సమాచారం క్రా స్‌చెక్ చేస్తారు. అనంతరం మీ స్వీయ జనగణనను ఆమోదిస్తూ.. సబ్‌మిట్ చేయడంతో జనగణన నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.