పప్పు ధాన్యాల సాగు తగ్గడమేంటి?
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:34 AM
రాష్ట్రంలో అనుకూలమైన సాగు పరిస్థితులు ఉన్నప్పటికీ పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గడం వాంఛనీయం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో 39శాతం మేర పడిపోయిన సాగు విస్తీర్ణం
పెసర, మినుముల సాగు 71శాతానికి పైగా తగ్గుదల
నువ్వులు, సన్‌ఫ్లవర్ సాగు 94శాతాంపైనే పడిపోయింది
రాష్ట్రంలో పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును పెంచాలి: తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో అనుకూలమైన సాగు పరిస్థితులు ఉన్నప్పటికీ పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గడం వాంఛనీయం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పప్పుధాన్యాల సాగు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ముందస్తు సాగు ప్రణాళికలపై శనివారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయలు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు, నూనెగింజల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2013-14 నుంచి ఈ ఏడాది వరకు సాగు వివరాలను పరిశీలిస్తే.. వరిసాగు విస్తీర్ణం 131.7 శాతం పెరిగిందని, పప్పుధాన్యాల సాగు 39శాతం తగ్గిందన్నారు. ముఖ్యంగా పెసల పంట సాగు విస్తీర్ణం 75.2 శాతం, మినుముల సాగు విస్తీర్ణం 71.5 శాతం మేర పడిపోయాయన్నారు. ఉలవలు సాగు విస్తీర్ణం 71.6 శాతం, సజ్జల సాగు విస్తీర్ణం 95 శాతం, అలసంద సాగు విస్తీర్ణం 72.4 శాతం, నువ్వుల సాగు విస్తీర్ణం 94.9 శాతం, పొద్దుతిరుగుడు సాగు విస్తీర్ణం 98.5 శాతం, ఆముదం సాగు విస్తీర్ణం 98.5 శాతం వేరుశనగ సాగు విస్తీర్ణం 51 శాతం మేర తగ్గాయని తెలిపారు. మన అవసరాల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడకుండా కూరగాయలు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు, నూనెగింజల సాగును పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు ఒకే రకమైన పంటను ఎక్కువగా వేయడంతో భూ సారం తగ్గడంతోపాటు యూరియా వినియోగం కూడా పెరుగుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వరి సాగు చేసే రైతులు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకం విత్తనాలను సాగు చేయాలని సూచించారు. సన్న రకాల విత్తనాలనే రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటే మద్దతు ధర కంటే ఎక్కువ ధర వచ్చే రకాలనే రైతులకు అందించాలని సూచించారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులతో సమావేశం నిర్వవహించాలని చెప్పారు. ఎరువుల ధరలను కేంద్రం నియంత్రించాలని అభిప్రాయపడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం.. ఎల్‌నినో ప్రభావంతో ఉత్తర తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాణలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. మే 15వ తేదీ నాటికి వాతావరణ శాఖ నుంచి కచ్చితమైన నివేదిక తెప్పించుకుని జిల్లాల వారీగా అక్కడి వాతావరణ పరిస్థితుల అంచనా ఆధారంగా రైతులు ఏఏ పంటలు సాగు చేయాలో తెలిపే సమగ్ర పంటల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.