Share News

17 లక్షల ఎకరాల్లో పంటవ్యర్థాలను తగలబెట్టారు!

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:36 AM

రాష్ట్రంలో పంట వ్యర్థాల కాల్చివేత మితిమీరుతోందని.. మూడేళ్ల క్రితం మొదలైన ఈ ధోరణి నానాటికీ శ్రుతిమించుతోందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ....

17 లక్షల ఎకరాల్లో పంటవ్యర్థాలను తగలబెట్టారు!

  • 2025-26 యాసంగిలో 3 నెలల్లోనే రాష్ట్రంలో ఈ స్థాయిలో కాల్చివేత

  • నేల ఆరోగ్యం, గాలి నాణ్యతకు నష్టం: వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్య

  • వ్యర్థాల కాల్చివేతను వెంటనే ఆపాలని రైతులకు విజ్ఞప్తి

  • లేకుంటే హైదరాబాద్‌ కూడా పదేళ్లలో ఢిల్లీలా మారుతుందని హెచ్చరిక

రాజేంద్రనగర్‌, జాన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంట వ్యర్థాల కాల్చివేత మితిమీరుతోందని.. మూడేళ్ల క్రితం మొదలైన ఈ ధోరణి నానాటికీ శ్రుతిమించుతోందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క 2025-26 యాసంగిలోనే రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో పంటవ్యర్థాలను తగులబెట్టినట్టు ఆయన వెల్లడించారు. దీనివల్ల నేల ఆరోగ్యం, గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి పనులు వెంటనే ఆపాలని ఆయన రైతులని కోరారు. విశ్వవిద్యాలయంలో ఇటీవల నెలకొల్పిన అధునాతన ఆర్‌ఎస్‌, జీఐఎస్‌ (రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్ఫర్మేటిక్‌ సిస్టం) ప్రయోగశాలలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉపగ్రహ ఛాయాచిత్రాలని విశ్లేషించి ఆయన ఈ గణాంకాలను విడుదల చేశారు. మొత్తం 17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను కాల్చగా.. అందులో 9 లక్షల ఎకరాల్లో వరికి సంబంధించినవి, మిగతా 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న తదితరాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా పంటవ్యర్థాలను తగులబెట్టిన జిల్లాల్లో నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయని జానయ్య తెలిపారు. అతి తక్కువగా పంట వ్యర్థాలను కాల్చిన జిల్లాల్లో రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌ నగర్‌ ఉన్నాయని పేర్కొన్నారు. పొలంలో రెండున్నర సెంటిమీటర్ల దిగువ భాగంలో ఉంటూ.. నేల ఆరోగ్యానికి, పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు ఈ ప్రక్రియ కారణంగా ఆహుతైపోతున్నాయని.. ఫలితంగా నేల నిస్సారంగా మారుతోందని ఆయన వెల్లడించారు.


ఒక టన్ను వరి గడ్డి, కొయ్యలని కాల్చివేయడం వల్ల ఐదున్నర కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌ గాలిలో కలసిపోతాయని జానయ్య వివరించారు. ఒక ఎకరానికి సుమారు రెండున్నర టన్నుల వరిగడ్డి, వ్యర్థాలు వస్తాయని, అంటే ఒక ఎకరం వరి విస్తీర్ణంలో వీటిని కాల్చినట్లయితే 13.5 కిలోల భాస్వరం, 6.75 కిలోల పొటాష్‌ గాలిలో కలసిపోయి తద్వారా వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్కల ప్రకారం 23.63 లక్షల కిలోల నత్రజని, 11.90 లక్షల కిలోల భాస్వరం, 1062 లక్షల కిలోల పొటాష్‌ ఈ మూడు మాసాల్లోనే గాలిలో కలసిపోయాయని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చకుండా తిరిగి నేలలోనే కలియదున్ని కొంత కాలం కుళ్ళనిచ్చినట్లయితే నేల సారం పెరగటంతో పాటు కాలుష్యం తగ్గించగలిగే వాళ్ళమని జానయ్య అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఒక టన్ను పంట వ్యర్ధాల కాల్చివేత వల్ల 60 కిలోల అతి ప్రమాదకరమైన కార్బన్‌ మోనాక్సైడ్‌తో పాటు 1460 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌, 200 కిలోల బూడిద గాలిలోకి విడుదల అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు వాతావరణంలో ఉష్ణోగ్రతపెరుగుదలకి ప్రధాన కారణమైన మీథేన్‌, నైట్రోజెన్‌ ఆక్సైడ్‌ వాయువులు గాలిలోకి విడుదల అవుతాయని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం ఎయిర్‌ పొల్యూషన్‌ ఇండెక్స్‌లో సురక్షితంగా ఉన్న హైదరాబాద్‌ మహానగరం వచ్చే 10 ఏళ్లలో మరో ఢిల్లీలా మారుతుందని హెచ్చరించారు.

Updated Date - Jun 25 , 2026 | 04:36 AM