Supreme Court: నల్లమలసాగర్‌ను నిలువరించండి
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:32 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం - నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది....
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్.. నేడు విచారించనున్న సీజేఐ ధర్మాసనం
న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం - నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘మిగులు/వరద జలాల పేరుతో గోదావరిపై ఏపీ అక్రమంగా నల్లమలసాగర్ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ, సెగ్మెంట్ 1 కింద ఉండే ప్రస్తుత కనెక్టివిటీ పనుల విస్తరణ, కుడి ప్రధాన కాలువ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకుండా స్టే ఇవ్వండి. కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖల ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు/డీపీఆర్ మూల్యాంకనం చేయకుండా, చట్టబద్ధ అనుమతులు మంజూరు చేయకుండా, ఆర్థిక సహాయం అందించకుండా ఆదేశాలు ఇవ్వండి’ అని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం 251 పేజీలతో తెలంగాణ తరఫున న్యాయవాది సుమంత్ నూకల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర జల వనరుల శాఖ, ఆర్థిక, పర్యావరణ శాఖలతోపాటు జీఆర్‌ఎంబీ, ఆంధ్రప్రదేశ్, కేఆర్‌ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీలను ప్రతివాదులుగా చే ర్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014, అంతర్‌రాష్ట్ర నదీ జలాల చట్టం, సీడబ్ల్యూసీ, పీపీఏ, కృష్టా, గోదావరి జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ల అవార్డులు, భౌగోళికంగా ఉల్లంఘన అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే.. కేంద్ర జలశక్తిశాఖ, కేంద్ర జలసంఘం, పీపీఏ, నేషనల్ వాటర్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ), కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులకు సైతం ఫిర్యాదు చేశామని పిటిషన్‌లో పేర్కొంది. గతంలో ముల్లపెరియార్ డ్యామ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ పిటిషన్‌లో గుర్తు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వరద జలాల పేరుతో పీబీ లింకు, పీఎన్ లింకు ప్రాజెక్టులను ఏపీ చేపడుతోందని ఆరోపించింది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ (పీఎ్‌ఫఆర్)ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్టు తెలిపింది. సీడబ్యూసీ మార్గదర్శకాల మేరకు పీఎ్‌ఫఆర్‌కు సూత్రప్రాయంగా అంగీకారం లభించిన తర్వాతే డీపీఆర్ తయారు చేయాల్సి ఉంటుందని, ఏపీ ఇవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన పీఎ్‌ఫఆర్‌పై తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సైతం అభ్యంతరాలను వ్యక్తం చేశాయని గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవటంతో కోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిపింది. తక్షణమే ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని, ఈ విషయంలో ఎటువంటి సహాయం అందించవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు రానుంది. ఈ కేసులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఏపీ ప్రభుత్వం నియమించుకుంది. ఆదివారం ఢిల్లీలో ఆయనతో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేశారు.