రాష్ట్రానికి యూరియా కోటా పెంచండి
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:40 AM
తెలంగాణకు సరఫరా చేస్తున్న యూరియా కోటాను పెంచాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం కోరారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ముందస్తు ...
నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వండి
జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల వినతి
యూరియా యాప్ అమలుపై నడ్డా సంతృప్తి
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు సరఫరా చేస్తున్న యూరియా కోటాను పెంచాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం కోరారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ముందస్తు అవసరాల కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని అడిగారు. రాష్ట్ర మంత్రి తుమ్మలకు గురువారం ఫోన్ చేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. రాష్ట్రంలో పంటల సాగు, యూరియా అవసరాలపై చర్చించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... 2026 ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రానికి 10 లక్షల టన్నుల యూరియా కేటాయించారని దానిని 11.50 లక్షల టన్నులకు పెంచాలని కోరారు. అలాగే జూలై, ఆగస్టు నెలల్లో గరిష్ఠ వినియోగం నమోదవుతుందని, రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే బఫర్ స్టాక్ అవసరమన్నారు. ఇందుకోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతి నెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి రాష్ట్రానికి గరిష్ఠ కేటాయింపులు చేయాలని, ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దేశీయ యూరియా సంస్థలైన ఆర్‌సీఎస్, క్రిబ్‌కో, ఆర్‌ఎ్‌ఫసీఎల్ నుంచి సరఫరా తగ్గిపోవటంతో మార్చి నెలలో రాష్ట్రానికి కేటాయించిన 1.34 లక్షల మెట్రిక్ టన్నుల్లో సుమారు 65 వేల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడిందని వివరించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్ కోసం మంత్రి వివరించారు. ఈ యాప్ వల్ల ఎరువుల నిల్వలపై రైతులకు సమాచారం ఉంటుందని, బ్లాక్ మార్కెట్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ... రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ యాప్‌పై సంతృప్తి వ్యక్తం చేయడమే కాక ఆ యాప్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.