Share News

ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:02 AM

తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో నిర్దేశిత సేకరణ లక్ష్యాలను సైతం పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విన్నవించారు.

ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలి

  • కస్టమ్‌ మిల్లింగ్‌ గడువునూ పొడిగించాలి

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషికి ఉత్తమ్‌ వినతి

న్యూఢిల్లీ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో నిర్దేశిత సేకరణ లక్ష్యాలను సైతం పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విన్నవించారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ రైతు ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని, రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక సీజన్‌లో రైతుల నుంచి 80.09 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. 2025-26లో ఖరీఫ్‌, రబీ కలిపి 152 లక్షల టన్నులకుపైగా సేకరించి రికార్డు నమోదు చేశామని వెల్లడించారు. రాష్ట్రం పంపిన ఉత్పత్తి అంచనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ధాన్యం సేకరణ లక్ష్యాలను నిర్దేశించడంతో రాష్ట్రంపై భారీ ఆర్థికభారం పడిందని వివరించారు. రబీ సీజన్‌లో 90 లక్షల టన్నుల ధాన్యం ేసకరణ అంచనాలు సమర్పించగా.. కేంద్రం 35 లక్షల టన్నుల బియ్యం (51.47లక్షల టన్నుల ధాన్యం) మాత్రమే తీసుకుంటామని ప్రకటించిందని తెలిపారు. మూడు సీజన్లలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను మించి 69.50లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేసిందని, తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.16,446 కోట్ల అదనపు భారం పడిందని వెల్లడించారు. 2025-26 రబీ ేసకరణ లక్ష్యాన్ని 54.50 లక్షల టన్నుల బియ్యం(80.09 లక్షల టన్నుల ధాన్యం) సేకరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే, సీఎంఆర్‌ సరఫరా గడవునూ పొడిగించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌ తెలిపారు. 2024-25 రబీకి సంబంధించి ఇంకా 5 లక్షల టన్నులు, 2025-26 ఖరీఫ్‌కు సంబంధించి 14.24 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. గోదాముల కొరత, మిల్లింగ్‌ సామర్థ్యాలపై ఒత్తిడి వంటి కారణాల రీత్యా 2024-25 రబీకి చెందిన సీఎంఆర్‌ సరఫరా గడువును 60 రోజులు, 2025-26 ఖరీఫ్‌కు చెందిన సీఎంఆర్‌ సరఫరా గడువును 120 రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రబీ సీజన్‌ సీఎంఆర్‌ను బాయిల్డ్‌ రైస్‌ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. 2026-27 ఖరీఫ్‌కు సంబంధించిన సేకరణ లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా రూపొందించాలని అభ్యర్థించారు. ఉత్తమ్‌ వెంట మంత్రి తుమ్మల ఉన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 04:02 AM