డీఏపీ, యూరియా సరఫరా పెంచండి
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:04 AM
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణకు డీఏపీ, యూరి యా సరఫరాను పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోళ్లలో 25శాతం పరిమితిని ఎత్తివేయండి
ఆయిల్‌పామ్ రైతులకు భరోసా కల్పించండి
కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మిచండి
కేంద్ర మంత్రులకు తుమ్మల నాగేశ్వర్‌రావు వినతి
న్యూఢిల్లీ, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణకు డీఏపీ, యూరి యా సరఫరాను పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్, ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్‌నాయుడుతో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోళ్లపై ఉన్న 25శాతం పరిమితిని వెంటనే ఎత్తివేయాలని, రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది తెలంగాణలో 15లక్షల టన్నుల మొక్కజొన్న, 3లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి వచ్చిందని, మార్కెట్ ధర తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ఆయా పంటలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, కనీస మద్దతు ధరతో వీటిని కేంద్రం సైతం సేకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసిన తుమ్మ ల.. రాష్ట్రంలో ఇప్పటికే 3 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా, వచ్చే మూడేళ్లలో ఆ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44శాతం నుంచి 16 శాతానికి తగ్గించడం వల్ల దేశంలోని ఆయిల్‌పామ్ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతి సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచాలని, ఆయిల్‌పామ్ రైతులకు కనీస గ్యారంటీ ధర విధానాన్ని అమలు చేసే అంశా న్ని పరిశీలించాలని కోరారు. కాగా, కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ను మంత్రి తుమ్మల కోరారు. గతంలో ప్రతిపాదించిన స్థలం అనుకూలంగా లేనందున రాష్ట్రప్రభుత్వం మరో స్థలం ఇచ్చేందుకు సుముఖంగా ఉందని, అక్కడ ఫీజుబులిటీ సర్వే నిర్వహించి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రామ్మోహన్‌నాయుడు స్పంది స్తూ.. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించి పది రోజుల్లో ఫీజుబులిటీ నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో తుమ్మల వెంట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలు
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి ఉంచాలన్న లక్ష్యంతో రైతు వేదికల్లో విత్తన మేళాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతువేదికల్లో నిర్వహిస్తున్న ‘విత్తన మేళా’లను మంగళవారం ఢిల్లీ నుంచి ఆయ న ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ 1,24,649 క్వింటాళ్ల వరి, 6,913 క్వింటాళ్ల పప్పు ధాన్యాలు, 11,815 క్వింటాళ్ల నూనెగింజలు, 1,339 క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న ఏడు సన్న రకాల ధాన్యానికి మాత్రమే రూ..500 చొప్పున బోనస్ అందుందని, ఆయా రకాలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు.