Telangana Govt: సూచనలొద్దు.. రిట్ పిటిషన్‌నే అనుమతించండి!
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:35 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన మూడు సూచనలు కాకుండా...
పోలవరం-నల్లమలసాగర్‌పై వాదనలకు తెలంగాణ సిద్ధం
నేడు సీజేఐ ధర్మాసనం ముందుకు రిట్‌పిటిషన్
గత విచారణ సందర్భంగా మూడు సూచనలు చేసిన కోర్టు
వాటిపై తెలంగాణ విముఖత.. పిటిషన్‌పై వాదనలకే మొగ్గు
విచారణకు హాజరవనున్న మంత్రి ఉత్తమ్.. కోర్టు నిర్ణయం వేరేగా ఉంటే ఏం చేయాలన్నదానిపై అక్కడికక్కడే నిర్ణయం
న్యూఢిల్లీ / హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన మూడు సూచనలు కాకుండా... తాము వేసిన రిట్‌పిటిషన్ కిందనే కేసును తీసుకుని వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తోందని, దానిని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 6న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మళ్లీ సోమవారం విచారణ జరగనుంది. 6వ తేదీన న్యాయస్థానం మూడు సూచనలు చేసి, ఇరు రాష్ట్రాలు వాటిని పరిశీలించాలని కోరింది. 2 రాష్ట్రాలు కూర్చుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఇందులో మొదటి సూచన. ఇది 2రాష్ట్రాల మధ్య జల వివాదం కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ ద్వారా కాకుండా 131 అధికరణం కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని రెండో సూచన చేసింది. అప్పుడు సాక్ష్యాధారాలతో సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని వేసినందున.. ఆ కమిటీ ముందే ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించుకోవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మూడో సూచన చేసింది.
సానుకూలత వ్యక్తంచేసినప్పటికీ ...
కోర్టు తీర్పు అనంతరం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల వివాదాలకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటించారు. తమకు వివాదాలు కాదని, నీళ్లు కావాలని ఇద్దరు నేతలు ప్రకటించారు. దీంతో రెండు రాష్ట్రాల మఽధ్య జల వివాదాలపై ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు మూడు సూచనలు కాకుండా రిట్ పిటిషన్‌నే విచారణకు స్వీకరించాలని కోరాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ విస్తరణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వాదించబోతోంది. పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరనుంది. కోర్టు తీర్పు వేరేగా ఉంటే.. ఒకవేళ కోర్టు రిట్ పిటిషన్‌ను అనుమతించకుంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం అక్కడికక్కడే న్యాయ నిపుణులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ అంశంపై ఆదివారం సచివాలయంలో అధికారులు, న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. సోమవారం కోర్టు విచారణకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి స్వయంగా హాజరుకానున్నారు. ఒకవేళ సుప్రీంకోర్జ్టు రాష్ట్ర వాదనను సానుకూలంగా తీసుకోకుంటే... ఏం చేయాలన్నదానిపై మంత్రి అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మొత్తంగా ఈ కేసు విచారణపై అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.