ఎగుమతులకు సహకరించండి
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:53 AM
తెలంగాణలో ఎగుమతుల బలోపేతానికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
వ్యవసాయం, ఫార్మా, టెక్స్‌టైల్స్ రంగాలకు అనుమతులు, నిధులివ్వండి
రాష్ట్రానికి అదనపు డ్రైపోర్టులు, రెండో ఎంఎంఎల్‌పీని ఇవ్వండి
లాజిస్టిక్స్ స్కిల్ యూనివర్సిటీ, కంటైనర్ తయారీ క్లస్టర్‌ను కేటాయించండి
కేంద్ర మంత్రి గోయల్‌కు శ్రీధర్ బాబు వినతి
న్యూఢిల్లీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎగుమతుల బలోపేతానికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఈ మేరకు శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయం, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి కీలక రంగాలలో తెలంగాణ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం నుంచి అవసరమైన ఆమోదాలు, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామి పారిశ్రామిక, ఎగుమతుల హబ్‌గా ఎదిగిందని, ఎగుమతులు, సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో స్వతంత్ర డెవల్‌పమెంట్ కమిషనర్ (డీసీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో అధిక కర్కుమిన్ కలిగిన, ఎక్కువ దిగుబడినిచ్చే పసుపు విత్తన రకాల అభివృద్ధికి పరిశోధనలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్‌లో కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను, కరీంనగర్ జిల్లాలో స్పైస్ బోర్డ్ లాబొరేటరీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో పత్తి పండే ప్రధాన జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్‌లలో సీఐఆర్‌సీఒటీ భాగస్వామ్యంతో కాటన్ టెస్టింగ్ లాబొరేటరీని నెలకొల్పాలని కోరారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఫార్మా రంగానికి ఊతమిచ్చేలా అత్యాధునిక వ్యాక్సిన్ టెస్టింగ్ లాబొరేటరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సనత్‌నగర్ డ్రైపోర్టు (ఐసీడీ)పై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నందున, పారిశ్రామిక ప్రాంతాల వద్ద కొత్త ఐసీడీలను అనుమతించాలన్నారు. రాష్ట్రానికి రెండో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు (ఎంఎంఎల్‌పీ)ను కేటాయించి, భరత్‌మాల ఫ్రేమ్‌వర్క్ కింద కేంద్ర ప్రభుత్వ సహ- పెట్టుబడులకు అవకాశం కల్పించాలని కోరారు. జాతీయ లాజిస్టిక్స్ విధానం, పీఎం గతిశక్తి లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో కంటైనర్ తయారీ సహాయ పథకం కింద తెలంగాణను ఓ కంటైనర్ తయారీ క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పటిష్ఠమైన స్టీల్ ఫ్యాబ్రికేషన్, ఇంజనీరింగ్ రంగాన్ని వాడుకోవడం ద్వారా దేశీయంగా కంటైనర్ల కొరతను అధిగమించవచ్చని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు శ్రీధర్‌బాబు వివరించారు..