1900 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:30 AM
ఆదిలాబాద్‌లో నిర్మించదల్చిన ఎయిర్‌పోర్టుకు ఎంత భూమి కావాలన్న విషయం కొలిక్కి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ అవసరాలకు 1,500 ఎకరాలు, పౌర విమనాయాన సేవల కోసం 400 ఎకరాలు కలిపి ...
ఇందులో 1,500 ఎకరాలు ఎయిర్ ఫోర్స్‌కు,400 ఎకరాలు పౌర విమానయాన సేవలకు
ఢిల్లీలో రాజ్‌నాథ్‌తో సీఎం భేటీ
భూ సేకరణ, నిధులపై మరోసారి కలవాలని నిర్ణయం
న్యూఢిల్లీ/అల్వాల్/హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో నిర్మించదల్చిన ఎయిర్‌పోర్టుకు ఎంత భూమి కావాలన్న విషయం కొలిక్కి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ అవసరాలకు 1,500 ఎకరాలు, పౌర విమనాయాన సేవల కోసం 400 ఎకరాలు కలిపి మొత్తం 1900 ఎకరాలు అవసరమని లెక్క తేలింది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు స్థలం రక్షణశాఖకు వ్యూహాత్మక ప్రాంతంగా ఉండడంతో రక్షణ శాఖ పరిధిలోని ఎయిర్‌ఫోర్సుకు, పౌర విమాన సర్వీసులకు కలిపి ఎయిర్‌పోర్టును నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏరకు ఎయిర్‌ఫోర్స్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అవసరాలకు అనువుగా రెండు టెర్మినల్స్‌ను నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 2.9కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. పౌర విమనాలు, వాయుసేన విమానాలు తిరిగేలా రన్‌వే నిర్మించనుండగా, దీనికే ఎక్కువ భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. ఇక విమానాశ్రయం నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు అవసరమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రధానంగా మెయింట్‌నెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ (ఎంఆర్‌వో), విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించనున్నారు. అలాగే రక్షణ శాఖకు చెందిన సిబ్బందికి అవసరమైన టౌన్‌షి్‌ప, అక్కడుండే వారికి అనువుగా స్కూల్స్, ఇతరత్రా మౌలిక వసతులను కల్పించనున్నారు. దీంతో పాటు టైనింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. కాగా, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి లెక్కలను తేల్చినప్పటికీ.. పరిహారం విషయంలో చిక్కుముడి వీడ లేదని తెలుస్తోంది. ఆదిలాబాద్‌లో ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఏరోడ్రోమ్‌కు 370 ఎకరాల భూమి ఉంది.
దీనికి అదనంగా 1530 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. వాస్తవానికి ఏరోడ్రోమ్ పరిధిలోని భూమికి అదనంగా 700 ఎకరాల భూమిని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 నవంబరు 3న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఇప్పుడు అదనపు భూమి కింద 1530 ఎకరాలు అవసరమవడంతో ఈ భూ సేకరణకు చెల్లించే పరిహారం నిధులను రక్షణశాఖ అందిస్తుందా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు.. ఇందులో ప్రభుత్వ భూములు ఎన్ని? రైతుల భూములు ఎన్ని? అనేది తేలాల్సి ఉంది. ప్రతిపాదిత ప్రాంతంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు చెందిన 800 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం సీసీఐ కార్యకలాపాలు నిలిచిపోయినందున.. ఆ భూములను రక్షణశాఖకు అప్పగించాలనే ప్రతిపాదన సైతం ఉంది. ఒకవేళఈ ప్రతిపాదనకు కేంద్రం సమ్మతిస్తే అదనపు భూసేకరణ వ్యవ హారం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన మరో 730 ఎకరాల భూమిని మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. భూ సేకరణ పరిహారం చెల్లింపునకు కేంద్రం అంగీకరిస్తే.. విమానాల పార్కింగ్ చార్జీలు, ఇంధనంపై రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.
అన్ని వసతులతో విమానాశ్రయం నిర్మించండి
భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కర్తవ్యభవన్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయిన సీఎం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీఎస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రికి రేవంత్ హామీ ఇచ్చారు. వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయానశాఖ టెర్మినల్ భవనాల నిర్మాణానికి సహకరించాలని, కార్గో, ఎంఆర్‌వో, హ్యాంగర్ వంటి సదుపాయాల కల్పనకు సహకరించాలని అభ్యర్థించారు. ఇటీవల మధ్య ఆసియా పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ సంస్థ.. హ్యాంగర్ ఏర్పాటుకు సరైన ప్రదేశాలను అన్వేషిస్తోందని, ఆ దిశగా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించారు. అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటుకు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని ప్రాంతాన్ని డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ ఎంపిక చేసుకున్నాయని, ఆ ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని కోరారు. కాగా, ఆదిలాబాద్ విమానాశ్రయ భూ సేకరణ పరిహారం చెల్లింపు విషయంపై మరోసారి భేటీ కావాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.