రాష్ట్రంలో పెరగనున్న మెడికల్ సీట్లు!
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:42 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది మెడికల్ సీట్ల సంఖ్య పెరగనుంది. కొత్తగా 465 పీజీ, 110 యూజీ సీట్ల కోసం రాష్ట్ర వైద్య శాఖ..
465 పీజీ, 110 యూజీ సీట్లకు ప్రభుత్వ దరఖాస్తు
ఒక్కో పీజీ సీటుకు 1.50 కోట్లు ఇవ్వనున్న కేంద్రం
రేపు ఢిల్లీకి మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది మెడికల్ సీట్ల సంఖ్య పెరగనుంది. కొత్తగా 465 పీజీ, 110 యూజీ సీట్ల కోసం రాష్ట్ర వైద్య శాఖ.. జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ)కు ఇప్పటికే దరఖాస్తు చేసింది. పదోన్నతుల వల్ల వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా పీజీ సీట్ల సంఖ్యను పెంచాలని కోరింది. అలాగే, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్‌మెడికల్ కాలేజీలతోపాటు మరికొన్ని చోట్ల ఉన్న యూజీ సీట్లకు అదనపు సీట్ల పెంచాలని అడిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం 4,090 యూజీ, 1,260 పీజీ సీట్లున్నాయి. అయితే, కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతినిచ్చిన తర్వాత ఒక్కో సీటుకు సగటున రూ.1.50 కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది. ఒక్కో సీటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చెయ్యాలి. కాగా, రాష్ట్రంలో 40 ప్రభుత్వ అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాలలున్నాయి. వాటిలో 21 కోర్సులుండగా.. మొత్తం 3 వేల సీట్లున్నాయి. అలైడ్ హెల్త్ కాలేజీలకు కూడా కేంద్రం ఏటా నిధులు ఇస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఈ ఏడాది సుమారు రూ.50 కోట్లు దక్కే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈనెల 29న ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రాష్ట్రం దరఖాస్తు చేసుకున్న కొత్త పీజీ, యూజీ సీట్ల మంజూరు, పీజీ సీట్లకు ఇచ్చే నిధులు, అలైడ్ కళాశాలలకు ఇచ్చే నిధుల అంశం, తదితర విషయాలను ఈ సమావేశంలో మంత్రి దామోదర చర్చించనున్నారు.