Share News

కేంద్రం మెచ్చిన ‘తెలంగాణ పంచాయతీ’!

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:16 AM

తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళుతున్నాయి. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ తాజాగా విడుదల చేసిన ‘పంచాయతీ అభివృద్థి సూచీ ...

కేంద్రం మెచ్చిన ‘తెలంగాణ పంచాయతీ’!

  • పీఏఐ సూచీలో రాష్ట్రానికి రెండో స్థానం.. 624 పంచాయతీలకు ‘ఏ’ గ్రేడ్‌.. 100 శాతం డేటా నమోదు

  • పరిపాలన, పారదర్శకతలోనూ ఆదర్శంగా మన గ్రామాలు

  • వేములపల్లి నుంచి ఫసల్వాది దాకా అద్భుత ప్రగతి

  • మహిళా సాధికారతకు నిదర్శనంగా ఫసల్వాది పంచాయతీ

  • పీఏఐ 2.0 నివేదికలో 9 అంశాల్లో రాష్ట్ర పంచాయతీల పరుగులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళుతున్నాయి. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ తాజాగా విడుదల చేసిన ‘పంచాయతీ అభివృద్థి సూచీ (పీఏఐ)’ 2.0 (2023-24)లో రాష్ట్రం అగ్రశ్రేణిలో నిలిచింది. పారదర్శకత, జవాబుదారీతనంలో దేశానికే దిక్సూచిగా నిలిచింది. గ్రామాల అభివృద్ధిలోనూ ఎవరూ సాటిలేరని చాటింది. రాష్ట్రంలోని మొత్తం 12,556 గ్రామ పంచాయతీలు వివరాలను నమోదు చేసి ఆదర్శంగా నిలిచింది. అత్యుత్తమ గ్రేడింగ్‌ సాధించిన జాబితాలోనూ దేశంలో తెలంగాణ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

‘ఏ’ గ్రేడ్‌లో తెలంగాణ హవా..

తాజా పీఏఐ 2.0 స్కోర్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలను కేంద్రం ఏ+, ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లుగా వర్గీకరించింది. దేశవ్యాప్తంగా ఒక్క పంచాయతీ కూడా ఓవరాల్‌గా ‘ఏ+’ (90కి పైగా స్కోర్‌) గ్రేడ్‌లో నిలవలేదు. తర్వాత ‘ఏ’ గ్రేడ్‌(75 నుంచి 90 స్కోర్‌)లో దేశవ్యాప్తంగా 3,635 పంచాయతీలు నిలవగా.. అందులో 624 పంచాయతీలు తెలంగాణవే. 943 పంచాయతీలతో త్రిపుర అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఏపీ (591), ఒడిశా (555) నిలిచాయి. ఇక రాష్ట్ర పంచాయతీల్లో అత్యధికంగా 10,056 పంచాయతీలు ‘బీ’ గ్రేడ్‌లో, 1,853 పంచాయతీలు ‘సీ’ గ్రేడ్‌లో, 23 పంచాయతీలు ‘డీ’ గ్రేడ్‌లో నిలిచాయి.


పలు విభాగాల్లో అత్యుత్తమ గ్రేడ్‌లు ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పంచాయతీల పనితీరును మొత్తం 9 ఇతివృత్తాల (థీమ్స్‌) ఆధారంగా అంచనా వేశారు. అందులో పలు కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలు కొన్ని ‘ఏ+(అచీవర్‌)’ గ్రేడ్‌ను సాధించాయి.

  • పేదరిక రహిత, మెరుగైన జీవనోపాధి పంచాయతీ: నల్గొండ జిల్లా వేములపల్లి బ్లాక్‌ రావులపెంట (97.50 స్కోర్‌).

  • ఆరోగ్యకరమైన పంచాయతీ: నిర్మల్‌ జిల్లా కుంటాల బ్లాక్‌ వెంకూర్‌ (91.33 స్కోర్‌).

  • బాలల స్నేహపూర్వక పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ బ్లాక్‌ వెంకటంపల్లి (96.67 స్కోర్‌).

  • నీటి సమృద్ధి గల పంచాయతీ: వరంగల్‌ జిల్లా నర్సంపేట బ్లాక్‌ పాత మఖ్దూంపురం(95.00 స్కోర్‌).

  • పరిశుభ్రమైన, పచ్చని పంచాయతీ: వరంగల్‌ జిల్లా దుగ్గొండి బ్లాక్‌ నారాయణ తండా (95.71 స్కోర్‌).

  • మౌలిక సదుపాయాలతో స్వయం సమృద్ధి గల పంచాయతీ: హనుమకొండ జిల్లా ఐనవోలు బ్లాక్‌ ఉడుతగూడెం (92.50 స్కోర్‌).

  • సుపరిపాలన గల పంచాయతీ: వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి బ్లాక్‌ మోతుకుపల్లె (90.42 స్కోర్‌).

  • మహిళా ేస్నహపూర్వక పంచాయతీ: సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి బ్లాక్‌ ఫసల్వాది (93.24 స్కోర్‌).

  • సామాజిక న్యాయం, భద్రత గల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ బ్లాక్‌ వెంకటంపల్లి (88.82 స్కోర్‌-ఏ గ్రేడ్‌).

గ్రామీణ ప్రాంతాల్లో 2030 నాటికి సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ పీఏఐ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది. పారిశుధ్యం, ఆరోగ్యం, పరిపాలన, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, పర్యావరణ సుస్థిరత వంటి కీలక రంగాల్లో పంచాయతీల పనితీరును ఇది అంచనా వేస్తుంది. గతంలో విడుదల చేసిన పీఏఐ 1.0లో 516 ఇండికేటర్లు ఉండగా.. పీఏఐ 2.0లో సులభతరం చేస్తూ 150 ఇండికేటర్లకు కుదించారు.

రాష్ట్ర టాపర్‌గా విట్టునాయక్‌ తండా..

రాష్ట్రంలోని 31 జిల్లాలు, 553 బ్లాకుల పరిధిలోని 12,556 గ్రామ పంచాయతీలు తమ వివరాలను కేంద్రానికి సమర్పించాయి. అందులో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి బ్లాక్‌ పరిధిలోని విట్టునాయక్‌ తండా 86.41 పాయింట్లతో రాష్ట్రంలో టాప్‌లో నిలిచింది.

Updated Date - Apr 30 , 2026 | 05:16 AM