సచివాలయానికి సర్కారీ ఇంటర్‌నెట్
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:44 AM
రాష్ట్ర సచివాలయంలో సర్కారీ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్...
ప్రస్తుతం నెట్ కోసం ఏటా 13కోట్ల ఖర్చు
టీ-ఫైబర్ నెట్‌కు మాత్రం ఏడాదికి 80 లక్షలే
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో సర్కారీ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టీ-ఫైబర్) ఇంటర్‌నెట్‌నే కొన్ని రోజులుగా సచివాలయంలో వినియోగిస్తున్నారు. ఆరు నెలల క్రితం టీ ఫైబర్ నెట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన అధికారులు.. వాస్తవిక నెట్ వినియోగం ఎంత ఉంది? ఏయే రోజుల్లో, ఏయే సమయాల్లో ఎక్కువ వినియోగం ఉంది? అనే వివరాలపై అధ్యయనం చేశారు. ఈ మేరకు 5జీబీపీఎస్ వేగం కంటే ఎక్కువగా నెట్ అవసరం పడడం లేదని తేలింది. ఈమేరకు 10 జీబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఉన్న సర్వర్లు 20జీబీపీఎస్ నెట్‌ను అందించగా, ఏటా రూ.13కోట్ల మేర ఖర్చయ్యేదని, టీ-ఫైబర్ నెట్‌కు రూ.80లక్షలు వెచ్చిస్తే సరిపోతుందని అధికారవర్గాలు తెలిపాయి. అలాగే, అసెంబ్లీ, శాసనమండలి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, త్వరలో ప్రారంభించనున్న మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో టీ-ఫైబర్ నెట్‌ను అందుబాటులోకి తేనున్నారు. కాగా, త్వరలో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ రంగ కార్యాలయాల్లోనూ టీ-ఫైబర్ పరిధిలోని ఇంటర్‌నెట్‌నే వాడాలని సూచిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు. ప్రస్తుతం ప్రైవేటు సర్వర్ల ద్వారా ఎంత ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు? ఎంత ఖర్చవుతోంది? అనే వివరాలను పంపాలని సూచించారు. ప్రస్తుతం 4 జిల్లాల పరిధిలోని 4 గ్రామాల్లో టీ-ఫైబర్ నెట్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో రాష్ట్రవ్యాప్తంగాఅందుబాటులోకి తేవాలని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.