ఆ ‘రెండో జీతం’ ప్రముఖుల ఇళ్లలో పనివాళ్లకు!
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:52 AM
కొందరు ఉద్యోగులు ఒకే ఆధార్, రెండు పేర్లతో.. రెండు ఉద్యోగాలు చేస్తూ.. పెద్ద మొత్తంలో రెండు జీతాలు తీసుకుంటున్న వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. ఉద్యోగ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యనేతలు, మంత్రులు, ఉన్నతాధికార్ల ఇళ్లలో పనిచేసేవారికి ఇస్తారంటున్న ఉద్యోగ సంఘాలు
ప్రొటోకాల్ ఖర్చులకూ వినియోగం
అందుకు నకిలీ ఉద్యోగుల పేర జీతాలు
పెద్ద శాఖల్లోనే జరుగుతుంది.. ఆర్థిక శాఖలో అందరికీ తెలుసన్న నాయకులు!
ఆధార్ మ్యాపింగ్‌లో వెల్లడైన నకిలీ ఉద్యోగుల బాగోతం
ఉద్యోగి దొరికితే అతనిపై చర్య.. ఉద్యోగులు లేకపోతే సంబంధిత విభాగాధిపతి నుంచే డబ్బు రికవరీ!
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కొందరు ఉద్యోగులు ఒకే ఆధార్, రెండు పేర్లతో.. రెండు ఉద్యోగాలు చేస్తూ.. పెద్ద మొత్తంలో రెండు జీతాలు తీసుకుంటున్న వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. ఉద్యోగ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ తరహా మోసాల గురించి ఆర్థిక శాఖకు తెలిసినా.. పాలనా పరమైన అవసరాల రీత్యా చూసీ చూడనట్లు పోతుంటారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, అధికారుల ఇళ్లలో పనిచేసే సిబ్బంది కోసం ఒకే వ్యక్తికి రెండు జీతాలు ఇస్తూ.. రెండో జీతం మీద మరో వ్యక్తిని అనధికారికంగా నియమించి పనులు చేయించుకుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ తరహా నియామకాలు పెద్ద శాఖల్లోనే జరుగుతాయని, అక్కడ గుర్తుపట్టడం అంత సులువుకాదని అంటున్నారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇచ్చిన సర్క్యులర్ మెమోలో కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, రెవెన్యూ, హోం, గిరిజన శాఖలను ప్రస్తావించారు. ఆయా శాఖల్లో ఎక్కువ విభాగాలు ఉండటం, ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటంతో అనధికారిక నియామకాల పేరుతో జీతాలు చెల్లించేందుకు అవకాశం ఉంటుందనే వాదనలు ఉన్నాయి. పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, సెర్ప్, ఉపాధి హామీ, స్ర్తీనిధి, ఆర్‌డబ్ల్యూఎస్ ఇలా పలు విభాగాలు ఉంటాయి. వాటిని ఆసరా చేసుకుని ఏదో ఒక విభాగం కింద నకిలీ ఉద్యోగుల పేరుతో జీతాలు డ్రా చేసి... ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించడం లేదా ప్రొటోకాల్, ఇతర శాఖాపరమైన అవసరాల కోసం ఆ నిధులు ఖర్చు చేసుకునేందుకు ఉపయోగిస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. కార్యాలయ అవసరాలకు, ప్రొటోకాల్ ఖర్చులకు, ఇతర అవసరాలకు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో.. ఇలాంటి డబ్బుతో సదరు కార్యక్రమాలు నిర్వహిస్తారని అంటున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని పేర్కొంటున్నారు.
చర్యలు ఎవరిపై? రికవరీ ఎవరి నుంచి?
నిజంగానే ప్రభుత్వ అవసరాల కోసం ఈ తరహా వ్యవహారాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే.. చట్టపరమైన చర్యలు ఇప్పుడు ఎవరిపై తీసుకుంటారనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఆధార్ మ్యాపింగ్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఎవరిని బాధ్యులను చేస్తారు? రికవరీ ఎవరి నుంచి చేపడతారు? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి దొరికితే అతని నుంచి, అసలు ఉద్యోగే లేకపోతే సంబంధిత విభాగ అధిపతిపై చర్యలు తప్పవని చెబుతున్నారు. జీతాల బిల్లులు పెట్టేవారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్లు తేలితే వారిపైనా, వారి ప్రమేయం లేకుండా ఈ వ్యవహారం గతంలో ఎవరో విభాగాధిపతి చేసి ఉంటే.. సంబంధిత విభాగాధిపతుల నుంచి రికవరీ చేయడం, శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
వ్యవస్థీకృత నేరం
మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల అవసరాల కోసం అడ్డదారుల్లో ఇలాంటి నియామకాలు చేయడం, ప్రభుత్వ నిధులతో జీతాలు చెల్లించడం ఎంతో కాలం నుంచి వ్యవస్థీకృత నేరంగా జరుగుతోందనే అభిప్రాయాలను కూడా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల ఇళ్లలో, అత్యున్నత పదవుల్లో ఉన్నవారి వద్ద పనిచేసే సిబ్బందికి రూ.15 వేలు, రూ.20 వేల చొప్పున అరకొర వేతనాలు ఇస్తే ఎవరూ పని చేసేందుకు రారని, అలాంటి సందర్భాల్లో ముఖ్యమైన వారి అవసరాల కోసం ఆయా శాఖల నుంచి రెండో జీతం మీద ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయని కూడా ఉద్యోగులు చెబుతున్నారు. అందరికీ తెలిసే జరుగుతున్న ఇలాంటి అక్రమాలపై ఎవరిని బాధ్యులను చేయాలనేదీ అంత సులువుకాదని అంటున్నారు.