Share News

15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:20 AM

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను విద్యాశాఖ మరో మూడు రోజులు పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం ఈనెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

  • వేసవి సెలవులు 3 రోజులు పొడిగింపు

  • అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను విద్యాశాఖ మరో మూడు రోజులు పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం ఈనెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కాగా, తాజా పొడిగింపుతో ఈనెల 15 నుంచి ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 227 పనిదినాలున్నాయి. ఫార్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎఫ్‌ఏ-1) పరీక్షలు జూలై 31 నుంచి, ఎఫ్‌ఏ-2 పరీక్షలు సెప్టెంబరు 21 నుంచి, సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు అక్టోబరు 1- 9 మధ్య, ఎస్‌ఏ-2 పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 9- 19 మధ్య ఉంటాయి. పదో తరగతి వార్షిక పరీక్షలు 2027 మార్చిలో నిర్వహించనున్నారు. దసరా సెలవులు అక్టోబరు 10- 22 వరకు (13 రోజులు), సంకాంత్రి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13- 17 వరకు (5 రోజులు) ఉంటాయని ప్రకటించారు. కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’గా ప్రకటించారు. దీని ప్రకారం మొత్తం 10 రోజులు విద్యార్థులు పాఠశాలకు బ్యాగుల్లేకుండా హాజరవ్వాలి. విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా ప్రతిరోజు 30 నిమిషాల సమయం కేటాయించారు. ఇందులో విద్యార్థులు వార్తాపత్రికలు, కథల పుస్తకాలు చదివేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఒంటిపూట బడులు వచ్చే ఏడాది మార్చి 15 నుంచి చివరి పనిదినం ఏప్రిల్‌ 23 వరకు నిర్వహించనున్నారు. అన్ని పాఠశాలల్లో అన్ని తరగతులకు డిజిటల్‌ పాఠాలు ప్రతిరోజు 20- 25 నిమిషాలు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 06:22 AM