Share News

దోసె.. మిల్లెట్‌ ఇడ్లీ..

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:19 AM

పేద విద్యార్థులకు ఆకలి తెలియకుండా చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి చదువుకునేలా ...

దోసె.. మిల్లెట్‌ ఇడ్లీ..

  • ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజుకో రకం అల్పాహారం

  • రాజ్‌భవన్‌ పాఠశాలలో ప్రారంభించిన మంత్రి పొన్నం

  • స్వచ్ఛంద సంస్థల సహకారంతో రూ.800 కోట్లతో పథకం

  • ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు కూడా: పొన్నం

ఖైరతాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు ఆకలి తెలియకుండా చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘విద్యార్థులకు అల్పాహారం, పాలు’ పథకాన్ని సోమవారం పాఠశాలల ప్రారంభం సందర్భంగా రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, యశస్వినీరెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక ఆల, డీఈవో యాదయ్య, మాజీ కార్పొరేటర్‌ విజయారెడ్డి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 29 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలకు రాగానే అల్పాహారం, పాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచేందుకు, డ్రాపవుట్లను తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ పథకానికి రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను సైతం ప్రారంభిస్తున్నామని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో తొలివిడతగా 45 పాఠశాలల్లో అల్పాహారాన్ని అందజేస్తున్నట్లు, దీని ద్వారా 12,437 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. మన్నా ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

అల్పాహార మెనూ ఇలా ...

  • సోమవారం: దోసె-చట్నీ.. చపాతీ-కూరగాయలు, పాలు

  • మంగళవారం: మిల్లెట్‌ ఇడ్లీ(2)- సాంబార్‌, రాగి జావ

  • బుధవారం: పూరీ (2)-ఆలూ కుర్మా, పాలు

  • గురువారం: మిల్లెట్‌ ఇడ్లీ (2)- సాంబార్‌, రాగి జావ

  • శుక్రవారం: మిల్లెట్‌ ఉప్మా-పొంగల్‌- చట్నీ, పాలు

  • శనివారం: బోండా (2)- చట్నీ, రాగి జావ

Updated Date - Jun 16 , 2026 | 05:19 AM