Share News

పంద్రాగస్టు నాటికి యూనిఫారాలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:00 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త యూనిఫారాలు ఆగస్టు 15 కల్లా అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది.

పంద్రాగస్టు నాటికి యూనిఫారాలు

  • ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం నాణ్యమైన వస్త్రంతో కుట్టిస్తున్న సర్కారు

  • ఇప్పటికే కేజీబీవీ బాలికలకు అందజేత

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త యూనిఫారాలు ఆగస్టు 15 కల్లా అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన యూనిఫారాలు అందించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు మఫత్‌లాల్‌ వంటి పేరుగాంచిన సంస్థ నుంచి వస్త్రాన్ని సేకరించారు. వాటిని స్వయం సహాయక సంఘాల మహిళలతో కుట్టించే పని వేగంగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లలోని 85 వేల మంది విద్యార్థినులకు యూనిఫారాలు అందించారు. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ బడులు, గురుకులాల్లోని విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు ఈసారి తొలిసారిగా విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టై, బెల్టులు కూడా అందించనుండటం గమనార్హం. ఆగస్టు 13 లోపు యూనిఫారాలను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. గతంలో పాఠశాల విద్యా విభాగం, గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామగ్రి వేర్వేరుగా కొనుగోలు చేేసవి. దానితో అనేక రకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. జాప్యం జరిగేది. దీన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సామగ్రి ేసకరణ, పంపిణీ ఒకే విధంగా ఉండేలా గత ఏడాది కేంద్రీకృత సేకరణ విధానాన్ని తీసుకువచ్చింది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫారాల కోసం 2.97 కోట్ల మీటర్ల వస్ట్రాన్ని సేకరించింది. స్థానికంగా ఉండే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫారాలను కుట్టిస్తోంది. విద్యార్థులకు అందించే యూనిఫారాలు, ఇతర సామగ్రి సేకరణలో చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలకూ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Updated Date - Jul 18 , 2026 | 06:01 AM