Share News

కార్పొరేట్‌ స్థాయిలో స్కూళ్ల యూనిఫాం

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:56 AM

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థుల తరహాలో మన్నికైన యూనిఫారాలను అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది.

కార్పొరేట్‌ స్థాయిలో స్కూళ్ల యూనిఫాం

  • స్కూళ్లలో లేత నీలిరంగు చొక్కా, ముదురు నీలం ప్యాంటు/స్కర్ట్‌

  • గురుకులాల్లో మెరూన్‌ రంగు గళ్లచొక్కా, మెరూన్‌ రంగు ప్యాంటు/స్కర్ట్‌

  • పైతరగతుల బాలికలకు ఇవే రంగుల్లోని పంజాబీ డ్రెస్‌, చున్నీ

  • నాణ్యమైన వస్త్రంతో తయారీ.. తొలిసారి బూట్లు, సాక్సులు, టై, బెల్టు కూడా..

  • జూలై 1 నాటికి రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అందేలా చర్యలు

  • లక్ష మంది విద్యార్థులకు నేటి నుంచే అల్పాహార పథకం.. 4 జిల్లాల్లో అమలు

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థుల తరహాలో మన్నికైన యూనిఫారాలను అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన వస్త్రం అయితేనే యూనిఫారాలు ఎక్కువరోజులు మన్నికగా ఉంటాయని, వస్త్రం సేకరణ నుంచి కుట్టు పని వరకు ప్రతి దశలోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాదు తొలిసారిగా బ్రాండెడ్‌ బూట్లు, సాక్సులు, టై, బెల్టులను కూడా అందజేయనున్నారు. విద్యార్థులకు యూనిఫాం, ఇతర సామగ్రి అందజేేసందుకు ప్రభుత్వం రూ.688 కోట్లు కేటాయించింది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫారాల కోసం 2.97 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందులో మఫత్‌లాల్‌ కంపెనీ 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ 55.32 లక్షల మీటర్ల వస్ట్రం సరఫరా చేస్తున్నాయి. కుట్టుపని బాధ్యతలను స్థానిక స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. జూలై 1 నాటికి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు యూనిఫాం అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రభుత్వం ఈసారి విద్యార్థుల యూనిఫాం రంగులను స్వల్పంగా మార్చిం ది. బడుల్లోని విద్యార్థులకు లేత నీలం రంగు చొక్కా, ముదురునీలంరంగు ప్యాంటు/స్కర్టు.. గురుకులాల విద్యార్థులకు మెరూన్‌ గళ్ల చొక్కా, మెరూన్‌ ప్యాంటు/స్కర్టు ఉంటాయి. పైతరగతుల్లోని విద్యార్థినులకు ఇవే రంగుల్లోని స్కర్ట్‌, పంజాబీ డ్రెస్‌, చున్నీ సరఫరా చేయనున్నారు.


నేటి నుంచి లక్ష మందికి అల్పాహారం..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం కూడా అందించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే సిద్ధం చేస్తుండగా.. అల్పాహారాన్ని మాత్రం కేంద్రీకృత వంట కేంద్రాల (సెంట్రలైజ్డ్‌ కిచన్‌)లో సిద్ధం చేసి బడులకు సరఫరా చేస్తారు. అంతటా ఇంకా సెంట్రలైజ్డ్‌ కిచెన్లు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అవి అందుబాటులో ఉన్న హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో సోమవారం సుమారు లక్ష మంది విద్యార్థులతో అల్పాహార పథకం ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్‌ కిచెన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అవిపూర్తయిన కొద్దీ విడతల వారీగా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.

టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక శిక్షణ..

ఈ విద్యా సంవత్సరంలో అల్పాహార పథకం విడతల వారీగా అన్ని పాఠశాలల్లో అమలు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో స్వచ్చంద సంస్థలను గుర్తించింది. ఇక టెక్నాలజీ పరంగా ఈ విద్యా సంవత్సరంలో అనేక మార్పులు చేస్తున్నాం. ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ టీచర్లందరికీ జూలైలో ప్రత్యేక శిక్షణ అందించబోతున్నాం.

- నవీన్‌ నికోలస్‌, పాఠశాల విద్య సంచాలకుడు

Updated Date - Jun 15 , 2026 | 03:56 AM