Share News

నేటి నుంచే బడి గంట

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:54 AM

వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బడులతోపాటు జూనియర్‌ కాలేజీల్లో ....

నేటి నుంచే బడి గంట

  • తెరుచుకోనున్న 29 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు

  • తొలిరోజే పాఠ్య పుస్తకాల పంపిణీ

  • గురుకుల విద్యార్థులకు ‘వెల్‌కం కిట్లు’

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బడులతోపాటు జూనియర్‌ కాలేజీల్లో 2026-27 కొత్త విద్యా సంవత్సరంప్రారంభంకానుంది. నిజానికి ఈ నెల 12వ తేదీనే తెరుచుకోవాల్సి ఉన్నా.. చాలా జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. కొత్త విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న పథకాలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సమీక్షించి, అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.

పిల్లలకు తొలిరోజునే పాఠ్య పుస్తకాలు

రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులు, 2 వేల గురుకుల విద్యాసంస్థలుండగా.. వాటిలో సుమారు 27 లక్షల మంది చదువుతున్నారు. వారందరికీ తొలిరోజునే పాఠ్యపుస్తకాలు అందజేయాలన్న సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 95శాతం పాఠశాలలకు చేరాయని, మిగతావాటికి ఒకట్రెండు రోజుల్లో చేరనున్నాయని తెలిపారు. ఇక గురుకుల విద్యార్థులకు ఈసారి ‘వెల్‌కం కిట్‌’ పేరుతో ప్రత్యేక పథకం అమలు చేస్తున్నారు. అందులో యూనిఫాంతో పాటు తెల్ల బూట్లు, తెల్ల సాక్సులు ఉంటాయి. గతంలో బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు మాత్రమే బూట్లు ఇచ్చేవారు. ఈసారి అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థులకు బూట్లను అందజేస్తున్నారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), పట్టణ గురుకుల పాఠశాలల విద్యార్థులకు.. బెల్టు, ఐడీ కార్డు, టై, స్కూల్‌ బ్యాగు, బూట్లు (నలుపు, తెలుపు సాక్సులతో), బెడ్డింగ్‌ సామగ్రి, ప్లేటు, గ్లాసు, చిన్న గిన్నె, ట్రంక్‌ బాక్సు, స్పోర్ట్స్‌ నైట్‌ డ్రెస్‌, ట్రాక్‌ సూట్‌ తో కూడిన సంపూర్ణమైన కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు తొలిసారిగా ట్రాక్‌ సూట్‌, నైట్‌ డ్రెస్‌లను ఇవ్వనుంది. ఇక తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో చదివే సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ బ్యాగు, బెల్టు, టై, నల్లటి బూట్లు, సాక్సులు అందజేయనుంది.

ప్రైవేటు బడులు రేపటి నుంచి..!

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ సోమవారమే ప్రారంభం అవుతుండగా.. పలు ప్రైవేటు పాఠశాలలు ఒకరోజు తర్వాత తెరుచుకోనున్నాయి. సోమవారం అమావాస్య కావడంతో తరగతులు ప్రారంభించవద్దనే సెంటిమెంట్‌తో.. హైదరాబాద్‌లోని చాలా ప్రైవేటు విద్యాసంస్థలు సోమవారం సెలవు ప్రకటించాయి. మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపాయి.

Updated Date - Jun 15 , 2026 | 03:57 AM