‘ప్రాథమిక’లో జీరో డ్రాపౌట్స్
ABN , Publish Date - May 08 , 2026 | 06:47 AM
ప్రాథమిక విద్యలో ‘జీరో డ్రాపౌట్స్’! మాధ్యమిక (సెకండరీ) విద్యలో మాత్రం 13.2 శాతం! పాఠశాలల్లో 86 శాతం కంప్యూటర్ల కల్పన! కానీ, ఇంటర్నెట్ సదుపాయాలు మాత్రం 43.3 శాతమే!
9, 10 తరగతుల్లో బడి మానేస్తున్న పిల్లలు 13.2శాతం
జాతీయ సగటును మించి విద్యార్థుల నమోదు.. బాలికల్లో కూడా
86 శాతం స్కూళ్లకు కంప్యూటర్లు.. ఇంటర్నెట్ మాత్రం 43.3 శాతమే
రాష్ట్రంలో సగటున 22 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు
తెలంగాణలో విద్య (2014-25)పై నీతి ఆయోగ్ ప్రశంసలు
న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యలో ‘జీరో డ్రాపౌట్స్’! మాధ్యమిక (సెకండరీ) విద్యలో మాత్రం 13.2 శాతం! పాఠశాలల్లో 86 శాతం కంప్యూటర్ల కల్పన! కానీ, ఇంటర్నెట్ సదుపాయాలు మాత్రం 43.3 శాతమే! అక్షర సేద్యంలో తెలంగాణ జాతీయ సగటును మించి అగ్రపథంలో దూసుకెళుతోంది. బాలికల విద్య, సెకండరీ స్థాయిలో 101.5 శాతం నమోదు రేటుతో సరికొత్త రికార్డులను సృష్టించింది. ‘స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా’ పేరుతో నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. 2014-15 నుంచి 2024-25 వరకు పదేళ్ల కాలంలో వచ్చిన మార్పులను విశ్లేషించింది. ముఖ్యంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థుల నమోదు (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో- జీఈఆర్) జాతీయ సగటును మించి ఉందని తెలిపింది. ప్రాథమిక స్థాయిలో 2014-15లో 105.64 శాతంగా ఉన్న జీఈఆర్.. 2024-25 నాటికి 114 శాతానికి చేరింది. ప్రాథమికోన్నత స్థాయిలోనూ 87.92 శాతం నుంచి 11.6 శాతం పెరిగి.. దేశంలోనే అత్యధిక పురోగతి సాధించిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సెకండరీ స్థాయిలో పదేళ్ల కిందట ఉన్న 76.7 శాతం నమోదు, ప్రస్తుతం 99.9 శాతానికి చేరుకుంది. హయ్యర్ సెకండరీ విభాగంలో జీఈఆర్ 49.58 శాతం నుంచి 67.6 శాతానికి పెరిగింది. బాలికల విద్యలోనూ జీఈఆర్ గణనీయంగా ఉండడం విశేషం. ప్రాథమికోన్నత స్థాయిలో బాలికల నమోదు గత పదేళ్లలో 88.91 నుంచి 113.4 శాతానికి; సెకండరీ స్థాయిలో 78.58 నుంచి 101.5 శాతానికి; హయ్యర్ సెకండరీలో 49.58 నుంచి 71.3 శాతానికి చేరింది. అలాగే, విద్యాభ్యాసం ఒక దశ నుంచి మరో దశకు సాఫీగా సాగుతూ ‘ట్రాన్సిషన్’ రేటులో మెరుగ్గా ఉంది. ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి 99.9 శాతం, అక్కడి నుంచి సెకండరీ స్థాయికి 98.9 శాతం విద్యార్థులు వెళుతున్నారు.
ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ రేటు దాదాపు సున్నా. అయితే, సెకండరీ స్థాయికి (9, 10 తరగతులు) వచ్చేసరికి బడి మానేస్తున్న వారి శాతం 13.2గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది జాతీయ సగటు (11.5 శాతం) కంటే ఎక్కువ. సెకండరీ నుంచి హయ్యర్ సెకండరీకి వెళ్లే విద్యార్థుల శాతం 72.8 వద్ద నిలిచింది. కాగా, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి (పీటీఆర్)లో జాతీయ సగటు 26 కాగా.. తెలంగాణలో సగటున ప్రతి 22 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.
కంప్యూటర్లలో టాప్.. ఇంటర్నెట్‌లో వెనుకబాటు
తెలంగాణలోని పాఠశాలల్లో గత దశాబ్ద కాలంలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. విద్యుత్తు సదుపాయం ఉన్న బడులు 92.6 నుంచి 95.1 శాతానికి చేరాయి. బాలుర మరుగుదొడ్లు 57 నుంచి 86.7 శాతానికి, బాలికల మరుగుదొడ్లు 70.7 నుంచి 92.9 శాతానికి పెరిగాయి. కంప్యూటర్లున్న పాఠశాలల సంఖ్య పదేళ్లలో 37.9 నుంచి ఏకంగా 86 శాతానికి ఎగబాకి రాష్ట్రం అగ్రపథంలో నిలిచింది. ఇంటర్నెట్ సౌకర్యం మాత్రం 43.3 శాతానికే పరిమితమై జాతీయ సగటు (63.5 శాతం) కంటే వెనకబడింది. కాగా, రాష్ట్రంలోని 36.6 శాతం బడుల్లోనే స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఉన్నాయి. మిగిలిన చోట్ల మౌలిక వసతులపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సూచించింది. అలాగే, దివ్యాంగులకు పాఠశాలల్లో అనుకూలమైన వసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వీల్ చైర్ తదితర సదుపాయాల కోసం ర్యాంపుల ఏర్పాటు 28.3 నుంచి 76.7 శాతానికి పెరిగింది. కానీ, దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు కేవలం 6.8 శాతం బడుల్లో మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఒకటి, రెండు అంశాలను మినహాయిస్తే.. పాఠశాల విద్యలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది.