Share News

పత్రాలు చూశాకే పిల్లల్ని స్కూల్‌ బస్‌ ఎక్కించండి !

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:53 AM

రవాణా, పోలీసు శాఖలతోపాటు తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని రవాణా శాఖ అధికారులు కోరారు.

పత్రాలు చూశాకే పిల్లల్ని స్కూల్‌ బస్‌ ఎక్కించండి !

  • విద్యార్ధుల తల్లిదండ్రులకు రవాణా శాఖ సూచన

  • 15 ఏళ్లు పైబడిన వాహనాల్లో విద్యార్థులను తరలించరాదని వెల్లడి

  • మంగళవారం ఒక్కరోజే 165 బస్సులపై కేసులు, 40 బస్సులు సీజ్‌

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రవాణా, పోలీసు శాఖలతోపాటు తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని రవాణా శాఖ అధికారులు కోరారు. పిల్లలను స్కూల్‌ బస్సు ఎక్కించే ముందే ఆ వాహన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను తల్లిదండ్రులు పరిశీలించాలని సూచించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను సంబంధిత పాఠశాల యాజమాన్యం లేదా వాహన డ్రైవర్‌ను అడిగి తీసుకోవాలని తెలిపారు. మారుమూల గ్రామాల్లో విద్యార్ధుల్ని తరలించే ఆటోలు ప్రమాదవశాత్తు బోల్తాపడి విద్యార్ధులు గాయపడ్డ ఘటనలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు ఎన్ని తనిఖీలు చేసినా, జరిమానాలు విధించినా.. జరిమానాలు చెల్లించి తిరిగి వాహనం నడుపుతుంటారన్నారు. అందువల్ల పరిమితికి మించి పిల్లలను వాహనాల్లో తరలిస్తుంటే పిల్లల్ని ఆ వాహనాల్లో పంపించవద్దని అధికారులు సూచించారు. ఇక, విద్యార్థులను ఉదయం పిక్‌ప్‌ చేసుకునేందుకు వెళ్లే సమయంలోనే వాహన తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యార్ధుల్ని తరలించే వాహనాలకు గరిష్ఠ కాలపరిమితి 15 ఏళ్లు మాత్రమేనని అధికారులు తెలిపారు. ఆ గడువు పూర్తి అయిన వాహనాల్లో విద్యార్ధుల్ని తరలించరాదన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల వాహనాల ఫిట్‌నెస్‌‌పై తనిఖీలు ముమ్మరం చేశామని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 1200లకుపైగా వాహనాల్ని తనిఖీ చేశామన్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 165 వాహనాలపై కేసులు పెట్టామని, ఫిట్‌నెస్‌ లేని 40 బస్సులను సీజ్‌ చేశామని వెల్లడించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 49 కేసులు నమోదు కాగా ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 21, రంగారెడ్డిలో 19 కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల బస్సులు ఉంటే దాదాపు 85ు బస్సులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాయన్నారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా విద్యార్ధుల్ని తరలిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Updated Date - Jun 17 , 2026 | 04:53 AM