28 బస్సులకే ఫిట్‌నెస్!
ABN , Publish Date - May 20 , 2026 | 03:23 AM
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన వాహనాల్లో కేవలం 28 శాతం మాత్రమే రవాణా శాఖ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నాయి...
మరో 15 రోజుల్లో పునః ప్రారంభం కానున్న విద్యా సంస్థలు
ఫిట్‌నెస్ ధ్రువీకరించాల్సినవి 19,322
పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే జారీ : రవాణా శాఖ
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన వాహనాల్లో కేవలం 28 శాతం మాత్రమే రవాణా శాఖ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యాలయాల పునః ప్రారంభ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వాటి వాహనాల ఫిట్‌నెస్ అంశం విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. రవాణా శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో మొత్తం 27,147 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వాటిలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందిన వాహనాలు కేవలం 7,825 మాత్రమే. అంటే మొత్తం విద్యాసంస్థల బస్సుల్లో కేవలం 28 శాతం మాత్రమే రవాణా శాఖ అనుమతులు పొందాయి. మిగిలిన 19,322 వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంది. మరో రెండు వారాల్లో విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో సుమారు 20 వేల వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేసి రోడ్లపైకి అనుమతించే ప్రక్రియ ఎంత వరకు పూర్తవుతుందనేది వేచి చూడాల్సిందే. కాగా నిర్ధేశిత ప్రమాణాలు పాటించని బస్సులకూ మోటారు వాహన పరిశీలకులు(ఎంవీఐ) ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తున్నామని రవాణా శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.