Share News

ఎస్సీ, ఎస్టీ చిన్న తరహా పరిశ్రమల నోడల్‌ ఏజెన్సీ!

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:33 AM

రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిధులు కేటాయించాలని, దళితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని..

ఎస్సీ, ఎస్టీ చిన్న తరహా పరిశ్రమల నోడల్‌ ఏజెన్సీ!

  • పూచీకత్తు లేని రుణాలిచ్చేందుకు రూ.100 కోట్లతో ఏర్పాటు చేయండి

  • సీఎం, డిప్యూటీ సీఎంకు ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేల వినతి

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిధులు కేటాయించాలని, దళితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దళిత యువత స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. పారిశ్రామికవేత్తలకు రూ. 15 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణాలు అందించేందుకు వీలుగా, రూ. 100 కోట్ల ప్రారంభ నిధితో ఒక ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ ఎంఎస్ఎంఈ నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో దళిత ప్రజాప్రతినిధుల బృందం సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను విడివిడిగా కలిసింది. జూలై 17న జరిగిన ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఉమ్మడి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించిన 14 ప్రధాన డిమాండ్లతో కూడిన తీర్మానాల నివేదికను వారికి సమర్పించారు. ప్రధానంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద భూమి లేని ప్రతి ఎస్సీ కుటుంబానికి భూ కేటాయింపు పరిధిని పెంచాలని, ప్రతి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా మరో 1,000 ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. జీవనోపాధి కార్యక్రమాల కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌ కేటాయింపులను భారీగా పెంచడంతో పాటు, అన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.


గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ‘ఇందిరా జలప్రభ’ పథకం కింద ప్రాధాన్య క్రమంలో ఉచిత బోర్‌వెల్స్‌ అందించాలని, అర్హులైన దళిత లబ్ధిదారులకు భూ పంపిణీలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధి నిధులను కేటాయించాలని వినతి పత్రంలో పొందుపరిచారు. దళిత ప్రజాప్రతినిధులు సమర్పించిన ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించిన వారిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, గణేశ్‌, మందుల శ్యామ్యూల్‌, కాలె యాదయ్య, లక్ష్మీకాంత్‌, వెడ్మ బొజ్జు నాగరాజు, లక్ష్మి రాగమయి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 06:40 AM