వెనక్కి మళ్లిన రూ.276 కోట్ల కేంద్ర నిధులు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:37 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నిష్ర్కియ వల్ల.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం విడుదల చేసిన రూ.276 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
ఎస్సీ, ఎస్టీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతోనే
ఉన్నతాధికారుల నిష్ర్కియే కారణం.. వివరణ కోరిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నిష్ర్కియ వల్ల.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం విడుదల చేసిన రూ.276 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. నిర్దేశిత గడువులోపు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు చెల్లించకపోవడ మే ఈ పరిస్థితికి కారణం. దీనిపై కేంద్ర గిరిజనశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును వివరణ కోరినట్టు తెలిసింది. రాష్ట్ర సర్కారు వివరణతో కేంద్రం సంతృప్తి చెందకపోతే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల గతేడాది ఫీజు రీయుంబర్స్‌మెంట్ నిధులకు కోత పడుతుంది. కేంద్రం నిధులను నిలిపివేస్తే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది. విషయమేంటంటే.. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు అందిస్తుంది. ఈమేరకు 2025-26 విద్యా సంవత్సరానికి రూ. 276 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.69 కోట్లు (25శాతం) మార్చి 31లోపు అందించాల్సి ఉంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరినా.. గడువులోపు సీఎం కార్యాలయం నుంచి స్పందన రాలేదు. దీంతో కేంద్ర నిధులు వెనక్కిమళ్లాయి. కాగా రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. గత నాలుగేళ్లలో బాకీపడ్డ రూ. 7500 కోట్లు ఎలా చెల్లించాలా అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అయినా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వినియోగించుకోలేకపోయింది.