మునిసిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల లెక్క చెప్పండి
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:26 AM
రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలో ఎస్సీ, ఎస్టీ కోటా కింద మంజూరైన పోస్టుల వివరాలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీల వివ రాలతో పాటు మహిళా ఉద్యోగుల రిజర్వేషన్లకు...
సమగ్ర నివేదిక కోరిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 24: రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలో ఎస్సీ, ఎస్టీ కోటా కింద మంజూరైన పోస్టుల వివరాలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీల వివ రాలతో పాటు మహిళా ఉద్యోగుల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర నివేదికను అందజేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పర్యాటకభవన్‌లో పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలోని కమిషనర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుచేస్తూ.. ఉద్యోగుల బ్యాక్‌లాగ్ ఖాళీలను ప్రత్యేక నియామకాల ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ఆయుష్మాన్‌భారత్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలను బలోపేతం చేయాలని, వారికి సంబంధించిన భూములను ఆక్రమణాదారుల నుంచి కాపాడాలని సూచించారు. నిధుల వినియోగంలో ఎటువంటి దారి మళ్లింపులు లేకుండా జాగ్రత్త వహించాలని కమిషన్ చైర్మన్ తేల్చి చెప్పారు. ఈ శాఖలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు అధికంగా ఉన్నప్పటికీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వంటి ఉన్నతస్థాయి పదవుల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని చెప్పారు.