10,497 యూనిట్లు.. 80,087 దరఖాస్తులు
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:42 AM
షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి పథకాలకు భారీ స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,497 యూనిట్లను పంపిణీ చేయనుండగా..
ఎస్సీ కార్పొరేషన్ ఉపాధి పథకాలకు భారీ స్పందన
జూన 2న మంజూరు పత్రాల పంపిణీ!
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి పథకాలకు భారీ స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,497 యూనిట్లను పంపిణీ చేయనుండగా.. వాటి కోసం 80,087 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్ కోసం సగటున 8 మంది పోటీపడుతుండటం గమనార్హం. ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం 5,016 యూనిట్లు అందుబాటులో ఉండగా 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎలక్ట్రిక్ త్రీవీలర్ల కోసం కూడా పోటీ నెలకొంది. ఈ విభాగంలో 2500 యూనిట్లకు దాదాపు 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, గేదెల యూనిట్‌పై (రూ.2.40లక్షలు) 70శాతం సబ్సిడీ ప్రకటించగా ఇందుకోసం కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావడంతో లబ్ధిదారుల ఎంపికపై యంత్రాంగం దృష్టి సారించింది. మండల స్థాయి అధికారుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి పంపనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మంజూరు పత్రాల పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా, పైలెట్ ప్రాజెక్టు కింద 10వేల మందికి ఆయా పథకాలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.219కోట్లు కేటాయించింది.