వేములవాడ అభివృద్ధికి రూ.86 కోట్లు
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:21 AM
వేములవాడ అభివృద్ధి సంస్థ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రగతికి, మౌలిక సదుపాయాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది..
నల్లగొండ తాగునీటికి రూ.83 కోట్లు
హైదరాబాద్, జూన్ 10(ఆంధ్ర జ్యోతి): వేములవాడ అభివృద్ధి సంస్థ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రగతికి, మౌలిక సదుపాయాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈమేరకు నిధులు సమకూరుస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 బడ్జెట్ అంచనాల కింద.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థకు తొలి విడతగా రూ.35.25 కోట్లు విడుదల చేసింది. అనంతరం మరో ఉత్తర్వు ద్వారా అదే సంస్థకు రూ.51 కోట్ల అదనపు నిధులు సైతం మంజూరు చేసింది. దీంతో వీటీఏడీఏకు రూ.86.25 కోట్లు కేటాయించినట్లయింది. అలాగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో తాగునీటి సరఫరా మెరుగు పరిచేందుకు సర్కారు సమాయత్తమైంది. దీని తొలి దశ పనుల కోసం.. రాష్ట్ర పట్టణ ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎ్‌ఫఐడీసీ) ద్వారా రూ.83 కోట్ల రుణం మంజూరు చేయడానికి అనుమతించింది. ఈమేరకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో టీయూఎ్‌ఫఐడీసీ ఒప్పందం కుదుర్చుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.