Share News

‘గుడిసెలు’ లేని రాష్ట్రంగా తెలంగాణ

ABN , Publish Date - May 30 , 2026 | 03:46 AM

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నే మార్గంగా ఎంచుకుంది.

‘గుడిసెలు’ లేని రాష్ట్రంగా తెలంగాణ

  • రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిర్ణయం

  • రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు

  • గుడిసెల్లో 15 వేల కుటుంబాలు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నే మార్గంగా ఎంచుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం నడుస్తుండగానే.. ప్రభుత్వం 2026-27 ఏడాదికి సంబంధించి రెండో విడత ఇళ్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ శుక్రవారం జీవో ఎంఎ్‌స-22ను జారీ చేసింది. అయితే రెండో విడతలో మొదటి విడతకు భిన్నంగా గుడిసెలు, రూఫ్‌టాప్‌ లేని ఇళ్లు, గోడల దశల్లో ఉన్న ఇళ్లకు ప్రత్యేకంగా కొన్ని వెసులుబాట్లు కల్పించింది. మొత్తం 2.50 లక్షల ఇళ్లలో కొత్తగా నిర్మించుకునే వాటి కోసం నియోజకవర్గానికి 1,500(100 నియోజకవర్గాలు, జీహెచ్‌ఎంసీ మినహాయింపు) చొప్పున 1,50,000 ఇళ్లను కేటాయిస్తారు. రూఫ్‌ రీప్లే్‌సమెంట్‌/ షెల్టర్‌ అప్‌గ్రెడేషన్‌ కింద నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున 100 నియోజకవర్గాలకు కలిపి 50,000, రాష్ట్ర రిజర్వ్‌ కోటా కింద(కొత్త ఇళ్లు 30 వేలు, రూఫ్‌ రీప్లే్‌సమెంట్‌/షెల్టర్‌ అప్‌గ్రెడేషన్‌ కింద 20 వేలు) 50 వేల ఇళ్ల చొప్పున కేటాయించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రాధాన్య క్రమంలో ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించగా, వీటిలో మొదటగా గుడిసెల్లో ఉండి, నిబంధనల ప్రకారం అర్హులుగా ఉన్నవారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగకుండా జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. గెజిటెడ్‌ అధికారులతో అర్హుల ధ్రువీకరణ, అర్హత ప్రమాణాల పరిశీలన, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదం ప్రకారమే ఇళ్లను మంజూరు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులే నిర్మించుకునే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి ఆవాస యోజన(అర్బన్‌, రూరల్‌)కు, పీఎం జన్‌మన్‌, వీబీ-జీఆర్‌ఏఎంజీ(ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) పథకాలకు అనుసంధానం చేయనున్నారు. అందులో భాగంగానే లబ్ధిదారుల వివరాలను ఆయా పోర్టల్స్‌లో నమోదు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాగా గోడలు, స్లాబుల దశలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలను ప్రత్యేకంగా ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పథకం అమల్లో భాగంగా తెలంగాణను గుడిసెల రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ సర్వేల ప్రకారం రాష్ట్రంలో 15 వేల కుటుంబాలు గుడిసెల్లో ఉంటున్నట్టు గుర్తించారు. ఆ కుటుంబాలన్నిటికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో మొదటి ప్రాధాన్యం కింద మంజూరు పత్రాలు అందజేయాలని నిర్ణయించారు.

Updated Date - May 30 , 2026 | 03:46 AM