సాదాబైనామాలకు పొరపాట్ల గ్రహణం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:13 AM
దరఖాస్తు సమయంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా సాదాబైనామా క్రమబద్ధీకరణ ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
దరఖాస్తుల్లో విస్తరణ, సర్వే నంబర్ల నమోదులో తప్పులు.. చాలామటుకు మీ సేవా ఆపరేటర్ల ద్వారా దొర్లినవే
ఎడిట్‌కు చాన్సే లేదు.. పక్కనబెడుతున్న అధికారులు
భూమి క్రమబద్ధీకరణ దిశగా అడ్డంకులు.. రైతుల్లో ఆందోళన
9.25 లక్షల దరఖాస్తుదారుల్లో ఇప్పటిదాకా 6 లక్షల మందికి నోటీసులు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): దరఖాస్తు సమయంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా సాదాబైనామా క్రమబద్ధీకరణ ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తుల్లో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్ల పరంగా తప్పులు దొర్లాయి. వీటిని సరిదిద్దేందుకు భూ భారతి పోర్టల్‌లో అవకాశం లేకపోవడంతో రైతులు గాబరా పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులు రాగా ఇప్పటిదాకా 6లక్షల మంది దరఖాస్తుదారులకు నోటీసులు పంపారు. మిగిలిన 3.25 లక్షల మంది దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. రెండువారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా స్వీయ పూచీకత్తు నుంచి అనేక రకాల సమస్యలు సాదాబైనామా దరఖాస్తుదారులను వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఎలాంటి సమస్య లేదని తేలిన తర్వాతే నోటీసు ఇచ్చిన 30 రోజుల తర్వాత రైతులకు చట్టబద్ధంగా భూ హక్కులు కల్పిస్తారు. 13-బీ జనరేట్ కావాలంటే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అమ్మిన వ్యక్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 13-బీ ఉంటేనే కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ భూమిపై చట్టబద్ధమైన హక్కు లభిస్తుంది. ఆ తర్వాత పట్టాదారు పాస్‌బుక్ ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది రైతులు ఇచ్చిన దరఖాస్తుల్లో తప్పులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. వీటిని సవరించేందుకు అవకాశం లేకపోవడంతో ఆ దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఆ సమయంలో చాలామంది రైతులకు అవగాహన లేకపోవడంతో మీ సేవా కేంద్రం ఆపరేటర్లపై ఆధారపడ్డారు. ఆపరేటర్లు చేసిన తొందరపాటు, అవగాహన లోపం వల్ల దరఖాస్తుల్లో తప్పులు జరిగాయి. విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లలో తప్పులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు.
ఒక రైతుకు రెండెకరాల భూమి ఉంటే పొరపాటున 20 గుంటలుగా లేదంటే 20 ఎకరాలుగా నమోదు చేశారు. సర్వే నంబర్ల విషయంలో అయితే 74/ఏ అని రాయాల్సిన చోట 74/బీ అని పడటం, నంబర్లు పూర్తిగా తారుమారు కావడం వంటివి గుర్తించి అధికారులు తల పట్టుకున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయి అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు కాగితాల్లో సర్వే నంబర్లకు, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఉన్న వివరాలకు మధ్య తేడాలు ఉండటాన్ని గుర్తించారు. ఫలితంగా సాదాబైనామాల్లో చాలామటుకు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాకు చెందిన రాములు అనే రైతు తనకున్న ఎకరా 20 గుంటల సాదాబైనామా భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. మీ సేవా కేంద్రం ఆపరేటర్ పొరపాటు వల్ల విస్తీర్ణంలో 20 గుంటలు అని మాత్రమే నమోదైంది. పరిశీలనకు వెళ్లిన అధికారులు లింకు డాక్యుమెంట్లు పరిశీలన చేసి రాములు దరఖాస్తును పెండింగ్‌లో పెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహిళా రైతు లక్ష్మమ్మ సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి సర్వే నంబరు 142/ఆ కి బదులు కేవలం 142గా నమోదైంది. దీంతో రెవెన్యూ అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. కొన్ని దరఖాస్తుల్లో ‘గంపగుత్తగా రాసుకున్నాం’ అంటూ పొందుపర్చారు. చెన్నూరు మండలం దుగ్నేపల్లిలో ఈ తరహా దరఖాస్తులు రావడంతో ఎంత విస్తీర్ణాన్ని రైతు పేరిట చేయాలి? అనే చర్చ అధికారుల్లో జరిగింది. ఈ తరహా దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలేదని అధికారులు చెబుతున్నారు.
సరిచేసే అవకాశం ఇవ్వండి
తమ దరఖాస్తుల్లో మీ సేవా ఆపరేటర్లు చేసిన పొరపాట్లకు తమను బలి చేయొద్దని కోరుతూ సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని అఽధికారులను రైతులు వేడుకుంటున్నారు. దీంతో.. పాత రెవెన్యూ రికార్డులు పరిశీలించి వాస్తవ వివరాలను నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులు సీసీఎల్‌ఏకు లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వం అవకాశం ఇస్తే తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.