Share News

రైతు డిస్కమ్‌కు లైసెన్స్‌.. పలు షరతులతో మంజూరు చేసిన ఈఆర్‌సీ..

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:12 AM

తెలంగాణ రైతు విద్యుత్‌ పంపిణీ డిస్కమ్‌కు లైసెన్స్‌ జారీ చేస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది.

రైతు డిస్కమ్‌కు లైసెన్స్‌.. పలు షరతులతో మంజూరు చేసిన ఈఆర్‌సీ..

  • వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించొద్దు

  • సాగుకు ఉచిత విద్యుత్‌ కొనసాగించాలి

  • భవిష్యత్తులోనూ మార్పు ఉండకూడదు

  • ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలి

  • ఇవీ ఈఆర్‌సీ విధించిన కొన్ని కీలక షరతులు

  • దక్షిణ, ఉత్తర డిస్కమ్‌లకు సవరణ లైసెన్స్‌లు

  • విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు

హైదరాబాద్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతు విద్యుత్‌ పంపిణీ డిస్కమ్‌కు లైసెన్స్‌ జారీ చేస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కొనసాగించాలని, మోటార్లకు మీటర్లు పెట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డిస్కమ్‌ కోసం మార్చి 19న (ఉగాది) రోజున లైసెన్స్‌ కోసం దరఖాస్తు రాగా మే 29న బహిరంగ విచారణ జరిగింది. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్‌ చట్టం-2003లోని సెక్షన్‌-14తో పాటు సెక్షన్‌-131 ప్రకారం లైసెన్స్‌ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, వాటర్‌బోర్డు, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ల కింద విద్యుత్‌ పొందుతున్న మున్సిపల్‌ తాగునీటి కనెక్షన్లు దీని పరిధిలోకి రానున్నాయి. ఈ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగు నెలల తర్వాత రైతు డిస్కమ్‌ కార్యకలాపాలు అమల్లోకి రానున్నాయి. ఇక రైతు డిస్కమ్‌ సేవలందించే కనెక్షన్లను వదిలేస్తూ సవరణ లైసెన్స్‌ కోసం దక్షిణ డిస్కమ్‌(ఎస్పీడీసీఎల్‌), ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీఎల్‌) దాఖలు చే సిన పిటిషన్లను ఈఆర్‌సీ ఆమోదించింది. రెండు డిస్కమ్‌ల నుంచి ఆ కనెక్షన్లను తొలగిస్తూ రైతు డిస్కమ్‌కు బదలాయించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా వినియోగదారులకు అందించే సేవలు, భౌగోళిక పరిధిలో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా కమిషన్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.


  • సెక్షన్‌-131 ప్రకారం సంబంధిత ఆస్తులు, అప్పులు, వినియోగదారులను రైతు డిస్కమ్‌కు బదిలీ చేయాలి.

  • రైతు డిస్కమ్‌ కనీసం రెండు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలు ఏర్పాటు చేయాలి.

  • రైతు డిస్కమ్‌ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ యథావిధిగా దరఖాస్తులు స్వీకరించి, కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలి. కనెక్షన్ల మార్పిడి క్రమంలో వ్యవసాయ కనెక్షన్లు సహా కొత్త వాటి మంజూరును ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయరాదు.

  • ఉద్యోగుల హక్కులు, సీనియారిటీ, పెన్షన్‌, రోస్టర్‌, పదోన్నతి అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

  • వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలి. ఈ విధానంలో భవిష్యతులో కూడా ఎటువంటి మార్పు ఉండదు.

  • వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయరాదు.

Updated Date - Jul 12 , 2026 | 06:49 AM