Share News

మండలానికో ఉద్యోగితో రైతు డిస్కమ్‌ ఎలా సాధ్యం?

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:47 AM

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన ‘రైతు డిస్కమ్‌’ నిర్వహణ తీరుపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) పలు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

మండలానికో ఉద్యోగితో రైతు డిస్కమ్‌ ఎలా సాధ్యం?

  • ఇంధన శాఖ ప్రతిపాదనలపై తెలంగాణ ఈఆర్సీ అభ్యంతరం

  • 30 లక్షల కనెక్షన్లకు 2వేల మంది సిబ్బంది సరిపోతారా అని ప్రశ్న

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన ‘రైతు డిస్కమ్‌’ నిర్వహణ తీరుపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) పలు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేవలం మండలానికి ఒక్క ఉద్యోగి చొప్పున కేటాయించి, అంతపెద్ద డిస్కమ్‌ కార్యకలాపాలను ఏ విధంగా నిర్వహిస్తారని ఇంధన శాఖను ఈఆర్సీ ప్రశ్నించింది. రాష్ట్రంలో 30.33 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు, హైదరాబాద్‌ వాటర్‌బోర్డు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ కనెక్షన్లన్నీ కలుపుకొని మొత్తం 30,34,032 కనెక్షన్లతో ఈ రైతు డిస్కమ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇంత భారీ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి ప్రభుత్వం 2 వేల మంది సిబ్బందిని మాత్రమే కేటాయించాలని నిర్ణయించింది. అయితే, కేంద్ర కార్యాలయ సిబ్బందిని మినహాయిస్తే, క్షేత్రస్థాయిలో ఒక్కో మండలానికి 6 వేలకు పైగా కనెక్షన్లు వస్తాయి. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి ఒక్క మండలంలో కేవలం ఒక్క ఉద్యోగిని ప్రతిపాదించడంపై ఈఆర్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యుత్‌ వినియోగంలో రైతు డిస్కమ్‌ వాటానే దాదాపు 42 శాతంగా ఉందని, ఆ లెక్కన చూసుకున్నా ఉద్యోగులు కూడా అదే నిష్పత్తిలో ఉండాలని స్పష్టం చేసింది. తెలంగాణలో రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని 2025 జూలై 30న ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి జూన్‌ 2వ తేదీ నుంచే ఈ డిస్కమ్‌ను సేవలను లాంఛనంగా ప్రారంభించాలని భావించినప్పటికీ, లైసెన్స్‌ జారీ ప్రక్రియలో ఆచరణాత్మక లోపాలు ఉండటంతో అది సాధ్యపడలేదు. మహారాష్ట్ర తరహాలోనే ఇక్కడ కూడా ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు ఇచ్చి, ‘డీమ్డ్‌ టూ లైసెన్స్‌’ పద్ధతిలో ముదుకెళ్లాని ఇంధన శాఖ ఓ దశలో యోచించింది. అయితే, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ చట్టప్రకారం మళ్లీ ఈఆర్సీ నుంచే లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. అందుకే తొందరపాటు పడకుండా అన్ని లాంఛనాలు పూర్తి చేశాకే చట్టబద్ధంగా ముందుకెళ్లాలని ఇంధన శాఖ భావిస్తోంది.

Updated Date - Jul 04 , 2026 | 06:49 AM