రైతు డిస్కం ఎందుకు?
ABN , Publish Date - May 25 , 2026 | 04:32 AM
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఎందుకు డిస్కం ఏర్పాటు చేయాల్సివస్తుందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ...
దేశంలో ఎక్కడా లేదు
ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తే కొత్త డిస్కం అవసరం లేదు
2 వేలమంది ఉద్యోగులతో 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా ఎలా సాధ్యం.. నిర్ణయాన్ని విరమించుకోవాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాల నేతలు, మాజీమంత్రి నిరంజన్
హైదరాబాద్ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఎందుకు డిస్కం ఏర్పాటు చేయాల్సివస్తుందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని రైతు సంఘాల నేతలు, మాజీమంత్రి నిరంజన్ రెడ్డి, రిటైర్డ్ ఎలక్ర్టిసిటీ ఇంజనీర్స్ ఫోర్స్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ‘‘రైతుడిస్కం - ప్రకటిత లక్ష్యాలు - ఆచరణ సవాళ్లు’’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు డిస్కం ఏర్పాటును తమ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని, 29న ఈఆర్సీ వద్ద జరిగే సమావేశంలో తమ వాదన వినిపిస్తామన్నారు. ప్రైవేటీకరణకే ఈ నిర్ణయం అన్నారు. కొత్త డిస్కం ఏర్పాటుపై గ్రామాలవారీగా అభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్‌చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నేత కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు పెడుతున్నారంటే ప్రైవేటీకరణవైపు అడుగులు వేస్తున్నట్లే భావించాల్సి ఉంటుందన్నా రు. సీపీఐ నేత తీగలసాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే రైతు డిస్కం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. రైతుసంఘం నాయకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ. 30 వేలకోట్ల విద్యుత్ బకాయిలుప్రభుత్వం చెల్లిస్తే కొత్త డిస్కం ఏర్పాటు చేయాల్సిన అవసరముండదన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎలక్ర్టిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. 5.5 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు, 2.60 లక్షల కిలోమీటర్ల లైన్లు, 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు కలిగి ఉండే రైతు డిస్కంకు కేవలం 2 వేల మంది ఉద్యోగులు సేవలు అందించడం ఎలా సా ధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జెన్‌కో ఏడీఈ కృష్ణ, ప్రవీణ్‌కుమార్, ఎస్.ఎల్.పద్మ కూడా మాట్లాడారు. తర్వాత రైతు డిస్కంకు లైసెన్స్ ఇవ్వొద్దని ఈఆర్సీని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.