రైతు బీమా ప్రీమియం పూర్తిగా చెల్లింపు
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:40 AM
రైతు బీమా పథకానికి సంబ ంధించి ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియం పెండింగ్ ఉండటంతో బీమా క్లైయిములు నిలిచిపోయానే అంశంపై ప్రభుత్వం స్పందించింది.
రెండున్నరేళ్లలో 66,038 రైతు కుటుంబాలకు 3,301.90 కోట్ల లబ్ధి
వెల్లడించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): రైతు బీమా పథకానికి సంబ ంధించి ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియం పెండింగ్ ఉండటంతో బీమా క్లైయిములు నిలిచిపోయానే అంశంపై ప్రభుత్వం స్పందించింది. ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియం అంతా చెల్లించామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 66,033 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరిందని వివరించారు. ఆయా కుటుంబాల నామినీల ఖాతాల్లో రూ.3,301.90 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 2023 డిసెంబరు నుంచి ఆ ఏడాది ముగిసే వరకు 20,090 కుటుంబాలకు రూ.1,004.50 కోట్లు, 2024 సంవత్సరంలో 25,861 కుటుంబాలకు రూ.1,293.05 కోట్లు బీమా సాయంగా అందించినట్లు తెలిపారు. 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు రైతు బీమా పథకంలో నమోదు చేసుకున్నారని.. వీరందరికీ వర్తించేలా ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ.1,359.56 కోట్లు ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందన్నారు. దీంతో 20,087 కుటుంబాలకు రూ.1,004.35 కోట్ల బీమా సాయం అందించినట్లు తెలిపారు. రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని, రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు.