5 రోజుల్లో రూ.7,135 కోట్లు జమ
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:37 AM
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
నేరుగా 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి..
ఐదో విడతలో 1.69 లక్షల మందికి 545.41 కోట్లు
‘రైతు భరోసా’లో మరో రికార్డు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7,135.77 కోట్లను నేరుగా జమ చేసి మరో రికార్డు సృష్టించిందని వివరించారు. శనివారం రైతు భరోసా పథకం ఐదో విడతలో 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులందరికీ రూ.545.41 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.69 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం పొందారని తెలిపారు. ఇప్పటికే తొలి నాలుగు విడతల్లో 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.77 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.